సాక్షి, టాస్క్‌ఫోర్స్: జీరో బిల్లులతో వెళ్తున్న గ్రానైట్ లారీలను రాష్ట్ర సరిహద్దులు దాటించడాన్ని కూటమి నేతలు ఆదాయంగా మార్చుకున్నారు. ఇందుకోసం సిండికేట్‌గా మారి అక్రమార్జనకు తెరలేపారు. ఇందులో టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు పోలీసు అధికారులు కూడా భాగస్వామ్యం కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే పిడుగురాళ్ల, పొందుగల మీదుగా ఓ సిండికేట్ బృందం లారీలను తెలంగాణ వరకు దాటిస్తోంది. కొత్తగా మరో సిండికేట్ బృందం వీరికి పోటీగా తయారైంది. గత నెల రోజులుగా గ్రానైట్ లారీలను రాష్ట్ర సరిహద్దులు దాటించే పనిలో ఉన్నాయి. కారంపూడి, మాచర్ల, నాగార్జునసాగర్ మీదుగా జీరో బిల్లు దందా నిర్వహిస్తూ లారీలను తెలంగాణ దాటిస్తున్నారు. పల్నాడులోకి ప్రవేశించినప్పటి నుంచి జిల్లా దాటే వరకు వారే బాధ్యత తీసుకుంటున్నారు. అందుకు గానూ పెద్దమొత్తంలో నగదు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు, రవాణాశాఖ, మైనింగ్, జీఎస్టీ అధికారుల్లో చలనం లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నకిరికల్లు, పిడుగురాళ్ల, దాచేపల్లిలో అప్పుడప్పుడు ఒకటీ ఆరా కేసులు బుక్‌చేసి ‘మమ’ అనిపిస్తున్నారు. పెద్ద మొత్తంలో అధికారులకు మామూళ్లు వెళ్లడంతో మిన్నుకుండిపోతున్నారన్న విమర్శలు లేకపోలేదు. దీంతో గ్రానైట్ సిండికేట్లు రెచ్చిపోతున్నాయి.
ఎమ్మెల్యే బంధువు కీలకపాత్ర
నాగార్జున సాగర్ మీదుగా అక్రమ గ్రానైట్ లారీలను తరలించడంలో కీలకపాత్ర మాచర్ల ఎమ్యెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి కుమారుడి వరుసయ్యే జూలకంటి అక్కిరెడ్డి, టీడీపీ నాయకుడు అనిల్ వహిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని టీడీపీ నేతలే మాచర్లలో బహిరంగంగా చర్చించుకుంటున్నారు. తాను అవినీతి చేయనని, కార్యకర్తలను సైతం చేయించనని గొప్పలు చెప్పే జూలకంటి బంధువుతో ఎలా గ్రానైట్ అక్రమ రవాణా చేయిస్తున్నాడంటూ సొంత పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఓ గ్రానైట్ లారీని కారంపూడి ఎస్‌ఐ అడ్డుకోగా నేరుగా అక్కిరెడ్డే రంగంలోకి దిగారు. బిల్లులు లేని గ్రానైట్ లారీని విడిపించి అతని ఆధ్వర్యంలో సాగర్ దాకా తీసుకెళ్లి సరిహద్దు దాటించినట్టు తెలుస్తోంది. లారీకి రూ.15 వేలు తీసుకొని జిల్లా దాటిస్తున్నట్టు సమాచారం.
నాగార్జున సాగర్ మీదుగా అక్రమ రవాణా లారీకి రూ.15 వేలు తీసుకొని రాష్ట్రం దాటిస్తున్న సిండి‘కేటు’గాళ్లు మాచర్ల ఎమ్మెల్యే బంధువు, ఓ ఎస్‌ఐ దగ్గరుండి అక్రమ రవాణా కారంపూడి నుంచి సాగర్ వరకు తరలించే బాధ్యత వీరిదే.. ఎమ్మెల్యే హస్తం లేకపోతే ఎందుకు అడ్డుకోలేదంటూ విమర్శలు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలం రోజూ రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి