నరసరావుపేటటౌన్: మాదక ద్రవ్యాలను నిర్మూలించడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఔషధ దుకాణాలపై చేపట్టిన ఆపరేషన్ గరుడ బృందం తనిఖీలు నరసరావుపేటలో రెండో రోజైన శనివారం కూడా కొనసాగాయి. పల్నాడు జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి డి.సునీత ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌లు మంగమ్మ, పద్మ, విజిలెన్స్, ఏఈఈ శివనారాయణ, ఎఫ్‌ఆర్‌ఓ సైదులు, సీఐ పి.రామకృష్ణ పట్టణంలోని బరంపేట్‌లో గల భవ్యశ్రీ మెడికల్ దుకాణానికి సంబంధించి భారీ స్థాయిలో ఔషధాలను అన్ లైసెన్సుడ్ గోదాంలో నిల్వ ఉంచినట్టు గుర్తించారు. ఈ మేరకు అక్కడ తనిఖీలు చేపట్టి రూ.18,40,000 విలువైన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు సునీత తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడ ఎటువంటి ఎన్డీపీఎస్‌కు సంబంధించి, కాల పరిమితి దాటిన ఔషధాలు, ఫిజిషియన్ శాంపిల్స్ లభించలేదన్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా ఈగల్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఔషధ నియంత్రణ శాఖ, పోలీసు శాఖలతో కూడిన సంయుక్త బృందం దాడులను నిర్వహిస్తుందన్నారు. హై యాంటీబయాటిక్స్, మత్తు కలిగించే మాత్రలను వైద్యుని చీటీ లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హోల్ సేల్ ఏజెన్సీలు, రిటైల్ మెడికల్ షాపులు కొనుగోలుకు సంబంధించి రసీదులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. అందులో ఎవరైనా పరిమితికి మించి భారీ స్థాయిలో మత్తు బిళ్లలు కానీ, హై యాంటిబయాటిక్స్ కానీ కొనుగోలు చేసినట్లు, డాక్టర్ చీటీ లేకుండా విక్రయించినట్లు పసిగడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.