జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు
నరసరావుపేట: ప్రభుత్వం చేపట్టిన పీ–4 (ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం) సర్వే ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో వెనుకబడిన వారిని గుర్తించి వారి అభ్యున్నతికి పనులు చేపట్టడమని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పీ–4 విధానంపై స్వచ్ఛంద సంస్థలు, స్టేక్ హోల్డర్లతో అర్థ గణాంకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్వేలో ప్రజలంతా పాలుపంచుకొని మెజార్టీ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటులో సహకరించి, భూములు ఇచ్చిన రైతుల అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, దీనికి పీ–4 సర్వే ఉపయోగపడుతుందని కలెక్టర్ చెప్పారు. సర్వేపై స్వచ్ఛంద సంస్థలు, స్టేక్ హోల్డర్స్ ప్రజల్లో అవగాహన కల్పించి ఎక్కువ మంది పాల్గొనేలా చూడాలని ఆయన కోరారు. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, స్టేక్ హోల్డర్స్, రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ సర్వే మంచిదని అభిప్రాయపడ్డారు. రెవెన్యూ జనరేషన్‌కు దోహదపడుతుందని తెలిపారు. రైతులతో పాటు అందరికీ అర్థమయ్యేలా తెలుగులో ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అర్థ గణాంకాధికారి శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ ఏడీ నవీన్‌కుమార్, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.