నరసరావుపేట: రాష్ట్రంలో మాలలు, వారి ఉప కులాలను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్‌పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ మాల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంగళవారం నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ విస్తల జయరావు ఆధ్వర్యంలో పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన దీక్ష చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి హాజరైన జాన్‌పాల్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. 2021 జనాభా లెక్కలు తేల్చకుండా వర్గీకరణ అమలు చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రంలో వేసిన వన్‌మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపటాన్ని మాల మహానాడు వ్యతిరేకిస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ చేసిన సూచనలను అమలు చేయకుండా, ఎంపారికల్ డేటా తీయకుండా రాష్ట్ర విభజనకు ముందు ఉన్న 2011 జనాభా లెక్కలను ఆధారం చేసుకొని వర్గీకరణ చేయటం దారుణన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజా పోరాటంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న రోజుల్లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ గోదా బాల, జిల్లా ఉపాధ్యక్షుడు కోండ్రు విజయ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిపూడి ఏసురత్నం, జిల్లా ఉపాధ్యక్షుడు కొర్రపాటి ఎర్రయ్య, నాయకులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణకు కేబినేట్ ఆమోదంపై మాల మహానాడు ఆగ్రహం