
పాఠశాలలకు తీవ్రంగా నష్టం చేసిన 117 జీవో రద్దు చేయాలి
సత్తెనపల్లి: విద్యారంగంలో సమస్యల్ని పరిష్కరించి గాడిలో పెడతామని ప్రకటించిన ఈ ప్రభుత్వం మళ్లీ అవే తప్పిదాలను కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఏపీటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిలర్ బండి రమేష్‌బాబు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలలకు తీవ్రంగా నష్టం చేసిన 117 జీవో రద్దు చేస్తామని ప్రకటించి కూడా ఇప్పటి వరకు ఆ ప్రయత్నం చేయలేయకపోవడాన్ని తప్పుపట్టారు. ఇప్పుడు తాజాగా జరగనున్న పని సర్దుబాటు ఆ జీవో ప్రకారం చేయాలని అధికారులు ఒక సమావేశంలో తెలిపినట్లు తెలుస్తోందని, ఆ జీవోను రద్దు చేయాలని ఆయన కోరారు. 10 మంది విద్యార్థులలోపు ఉన్న పాఠశాలలను మూసివేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తోందని, ఇది విద్యారంగానికి, పాఠశాలల మనుగడకు తీవ్రహాని చేసే నిర్ణయమని విమర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు మాట్లాడుతూ వెంటనే పదోన్నతులు చేపట్టి అర్హత ఉన్నవారిని పై క్యాడర్‌లో నియమిస్తే పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా ఉపాధ్యాయ సంఘాల సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కార్యదర్శి డి.శ్రీనివాస రావు మాట్లాడుతూ బోధనేతర యాప్‌లు రద్దు చేయాలని, తల్లికి వందనం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే వర్తింపజేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా సబ్ కమిటీ సభ్యులు బాల శ్రీనివాసరావు, బర్రా శ్రీనివాసరావు, సత్తెనపల్లి జోన్ పరిధిలోని వివిధ మండలాల నాయకులు శివారెడ్డి, ధర్మారావు, సునీల్ కుమార్, భావనా రుషి, ఐ.వెంకటేశ్వరరావు, పి.మారుతి, రమేష్, మదన్మోహన్, కిరణ్‌కుమార్, ఫిరోజ్ పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ సత్తెనపల్లిలో ఏపీటీఎఫ్ ప్రాంతీయ సమావేశం