
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం
రాయగడ: వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో ఈ మేరకు శనివారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష సమావేశంలొ ఆమె మాట్లాడుతూ డెంగీ, మలేరియా, అతిసారం వంటి వ్యాధులు అత్యధిక శాతం ప్రబలే అవకాశం ఉన్నందున వాటిని సమర్థంగా ఎదుర్కొనే విధంగా ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక దృష్టి సారించాలని అన్నారు. జిల్లాలోని ప్రత్యేక అంగన్‌వాడి, ఆశ కేంద్రాల్లో సరిపడా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందేవిధంగా అవసరమయ్యే మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. గ్రామంలో ప్రతి సమా చారాన్ని ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ఆరోగ్య శాఖకు అందించాలని సూచించారు. సమావేశంలొ ఏడీఎంఓ డాక్టర్ మమత చౌధరి, జిల్లా ముఖ్యవైధ్యాధికారి డాక్టర్ బి.సరోజిని దేవి, జిల్లా అదనపు ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సుబుద్ధి, జిల్లా అదనపు కలక్టర్ రమేష్ చంద్ర నాయక్, ఏడీఎంఒ డాక్టర్ మమత సాహు తదితరులు పాల్గొన్నారు.