
అతిసారం కేసులు నమోదు కాలేదు
● రాష్ట్ర ఆరోగ్య శాఖ బృందం వెల్లడి
రాయగడ: జిల్లాలోని ఏ ప్రాంతాల్లో అతిసార వ్యాధి కేసులు నమోదు కాలేదని వైద్య బృందం స్పష్టం చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతిసార ప్రబలినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖకు చెందిన డాక్టర్ మదన్ మోహన్ ప్రధాన్ నేతృత్వంలో జాతీయ స్వస్థ్య మెషిన్ రాష్ట్ర విభాగానికి చెందిన కన్వీనర్ అద్వేత్ ప్రధాన్, గ్రామీణ నీటి సరఫరా విభాగం చీఫ్ ఇంజినీర్ (భువనేశ్వర్) నారాయణ ప్రధాన్ గాంధీ, ల్యాబ్ అసిస్టెంట్ అబీన్ కుమార్ బొరల్‌ల బృందం జిల్లాలో రెండు రోజులు పర్యటించింది. సదరు సమితిలోని కూలి, కందిలి, పితామహాల్, కొలనార సమితిలోని సూరి తదితర ప్రాంతాల్లో పర్యటించిన వైద్యబృందం అక్కడి గ్రామస్తులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి సరఫరా ప్రాంతాలను పరిశీలించారు. అయితే ఆయా ప్రాంతాల్లో మలేరియా, అతిసార ప్రబలినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి మలేరియా, డెంగీ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరిలోని కొరాపుట్ వీధి, జొడియా వీధి, హరిజన్ వీధులతోపాటు టికిరపడ, మైకంచ్, డుడుకాబహాల్, శంకరడ గ్రామాల్లో పర్యటించిన బృందం అక్కడి పరిస్థితిని అధ్యయనం చేశారు. జిల్లాలో ఎక్కడా అతిసారం సోకలేదని అదేవిధంగా మలేరియా, డెంగీ వ్యాధులు అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తగా ఉండాలని ఎటువంటి అనారోగ్యానికి గురైతే వెంటనే సమీపంలోని ఆస్పత్రి వైద్యులను సంప్రదించాలని సూచించారు.