పనులు పూర్తయ్యేనా? | - | Sakshi
Sakshi News home page

పనులు పూర్తయ్యేనా?

May 17 2025 6:59 AM | Updated on May 17 2025 6:59 AM

పనులు

పనులు పూర్తయ్యేనా?

సగం భూమి పోయింది..

తాతలతండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి 3 ఎకరాలు. ఇందులో ఎకరాన్నర భూమి రిజర్వాయర్‌లో కలిసి పోయింది. ఇల్లు పోయింది. 2008లో ఎకరాకు రూ.2.30 లక్షలు ఇచ్చారు. అవి అప్పుడే ఖర్చయిపోయాయి. ఉన్న భూమి వదల్లేను. ఇక్కడ ఉండటానికి ఇల్లు లేదు.

– దాసరి తాతారావు, రైతు, రేగులపాడు, పలాస మండలం

వచ్చే ఏడాదికి నీరు నిల్వ

వచ్చే ఏడాది జూన్‌కల్లా ఆఫ్‌షోర్‌లో 0.521 టి.ఎం.సిలు నీటిని నిల్వ చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఆ దిశగా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఆఫ్‌షోర్‌ సామర్ధ్యం 1.864 టి.ఎం.సిలు. అందుకు అనుగుణంగా పనులు చేపడుతున్నాం. రోజుకు 8000 క్యూబిక్‌ మీటర్ల మట్టిపనిని చేస్తున్నాం. ఇప్పటి వరకు 45 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం.

– బి.శేఖరబాబు, ఈఈ, వంశధార ప్రాజెక్టు

పలాస: మండలంలోని రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు ఎట్టకేలకు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఎప్పటికప్పుడు పనులు ప్రారంభించడం.. కొన్నాళ్లు కొనసాగడం.. తర్వాత నిలిచిపోవడంతో పరిపాటిగా మారింది. అరకొర నిధులు నేపథ్యంలో ఈసారి కూడా పనులు పూర్యయ్యేది అనుమానమేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రిజర్వాయర్‌వద్ద ఎర్త్‌బండ్‌ పనులు జరుగుతున్నాయి.

17 ఏళ్లుగా కొనసాగుతూ..

రేగులపాడు నుంచి నందిగాం, మెళియాపుట్టి మండలాలకు ఆర్‌.ఎం.సి, పలాస మండలానికి ఎల్‌.ఎం.సి కాలువల ద్వారా మొత్తం 24,500 ఎకరాలకు సాగునీరు, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి తాగునీరు అందించేందుకు 2008లో రూ.128 కోట్ల అంచనా వ్యయంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులకు శంకుస్థాపన చేశారు. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులకు రూ.456 కోట్లు అంచనా వేశారు. అయినా పనులు మాత్రం జరగలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 2021లో ఈ పనులకు రూ.850 కోట్లు అంచనా వేసి పనులు ప్రారంభించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పునరావాసాలు కల్పించారు. రిజర్వాయర్‌ సంబంధించిన పనులు కూడా కొంతమేర జరిగాయి. తర్వాత ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెటులో రూ.30 కోట్లు కేటాయించారు. తాజాగా ఇప్పుడు మరో రూ.90 కోట్లు నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఎర్త్‌ బండ్‌ పనులు ప్రారంభమయ్యాయి. మెళియాపుట్టి మండలం చాపర వద్ద మహేంద్రతనయ నది నుంచి వరద కాలువను 13.6 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఇందులో 7 కిలోమీటర్ల పని పూర్తి చేశారు. మిగిలినది అసంపూర్తిగా ఉంది. ప్రస్తుతం ఎర్త్‌ బండ్‌ పనులతో పాటు కుడికాలువ మెయిన్‌ కెనాల్‌ పనులతో పాటు వరదకాలువలో డీవాటరింగ్‌ పనులు చేపడుతున్నారు. మరోవైపు, సుమారు 17 ఏళ్లు పూర్తవుతున్నా నిర్వాసితుల సమస్యలు ఎక్కడికక్కడ పెండింగ్‌లో ఉన్నాయి. వాటి పరిష్కారానికి నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుతో పాటు నిర్వాసితుల సమస్యలు ఎప్పటికి పూర్తవుతాయో వేచి చూడాల్సిందే.

ఎట్టకేలకు ఆఫ్‌షోర్‌ పనులు పునఃప్రారంభం

అంచనాలు పెరగడమే తప్ప పూర్తికాని వైనం

ఎక్కడికక్కడే నిర్వాసితుల సమస్యలు

పనులు పూర్తయ్యేనా? 
1
1/2

పనులు పూర్తయ్యేనా?

పనులు పూర్తయ్యేనా? 
2
2/2

పనులు పూర్తయ్యేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement