
పరిశీలన, పరిశుభ్రతతో డెంగీ నివారణ
భువనేశ్వర్: ప్రాణాంతక డెంగీ మహమ్మారిని సులభ రీతిలో నివారించడం సాధ్యమేనని ప్రముఖులు ప్రబోధించారు. రాష్ట్ర స్థాయి జాతీయ డెంగీ దినోత్సవం పురస్కరించుకుని ఆరోగ్య శాఖ ప్రముఖులు ఈ విషయాన్ని వివరించారు. పరిశీలన, పరిశుభ్రతతో డెంగీ నివారణ ఈ ఏడాది నినాదంగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో అవగాహన పెంపొందించి ప్రభావవంతమైన డెంగీ నివారణ వ్యూహాలను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రూపొందించిందని తెలిపారు. స్థానిక కంబైండ్ హెల్త్ డైరెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం జాతీయ డెంగీ దినోత్సవం నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అనుబంధ వర్గాలు వర్చువల్ మాధ్యమంలో పాలుపంచుకున్నారు. వెక్టర్ బోర్న్ డిసీజెస్ అదనపు డైరెక్టర్ డాక్టర్ ప్రభా కర్ సాహు, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నీలకంఠ మిశ్రా, అదనపు డైరెక్టర్ డాక్టర్ ప్రమీల బొరాల్, వైద్య విద్య శిక్షణ సంస్థ అదనపు డైరెక్టరు డాక్టర్ బ్రజకిషోర్ దాస్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డెంగీ నివారణలో సమాజ భాగస్వామ్యం యొక్క అవసరాన్ని ప్రజారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ జితేంద్ర మోహన్ బబర్త తెలిపారు. కార్యక్రమంలో భాగంగా డెంగీ నివారణ నినాదం, చైతన్య సందేశంలో చైతన్య రథం సేవల్ని ప్రముఖులు ప్రారంభించారు.