
అంబోదళలో దాహం కేకలు
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబోదళలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో బుధవారం మహిళలంతా కలిసి పంచాయతీ కార్యాలయానికి తాళంవేసి నిరసన తెలిపారు. అంబోదళలో పాయికో, గౌడ వీధుల్లో 150కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరందరి తాగునీటి సౌకర్యార్థం ఉండే సోలార్ గొట్టపుబావి గత మూడేళ్లుగా మరమ్మతులకు గురయ్యింది. అదేవిధంగా ఉన్న రెండు గొట్టపు బావుల్లో ఒకటి పాడైపోయింది. దీంతో తాగునీటికి నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో స్పందించిన పంచాయతీ అధికారులు సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.