
‘సమస్యలు పరిష్కరించాలి’
శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సంపతిరావు కిశోర్‌కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్.బాబూరావు అధ్యక్షతన సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కిశోర్‌కుమార్ మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఈ నెల 15వ తేదీన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రధాన డిమాండ్లను వివరించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామమూర్తి మాట్లాడుతూ ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ చేపట్టాలని, ఉర్దూ మైనర్ మీడియం బోధించే ఉపాధ్యాయులను తెలుగు మీడియం ఎస్జిటి, ఎస్‌ఏలతో కలిపి లెక్కించి పోస్టులు కేటాయించడం సరికాదన్నారు. విద్యార్థుల సంఖ్య 75కు మించితే పీఎ స్ హెచ్‌ఎం పోస్ట్ అదనంగా కేటాయించాలన్నారు. అనంతరం యూటీఎఫ్ సంఘ పెద్దలు డీఈఓ తిరుమల చైతన్యకు, జిల్లా పరిషత్ సీఈఓకు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రాలను అందజేశారు.