
విగతజీవులుగా పడి ఉన్న ప్రేమజంట
పరారైన ప్రేమజంట
● పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో నిర్ణయం
మల్కన్‌గిరి: జిల్లాలోని మల్కన్‌గిరి సమితి తమ్స పంచాయతీ ఎంవీ–7 గ్రామం సమీపంలోని తోటలో ప్రేమజంట మృతదేహాలను గ్రామస్తులు శుక్రవారం గుర్తించారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఎంవీ–7 గ్రామానికి చెందిన నందే మడకామి(18), నవీన్ మడకామి(24) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇరువురి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో నందేకు మరో సంబంధం చూసిన తల్లిదండ్రులు ఈనెల 22వ వేరొకరితో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఇరువురూ మంగళవారం రాత్రి ఇంటి నుంచి పారిపోయారు. మరుసటి రోజు ఉదయం చుట్టుపక్కల తల్లిదండ్రులు వెతికినా ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం ఉదయం గ్రామం సమీపంలోని తోటలో విగతజీవులుగా పడి ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. దీనిపై మల్కన్‌గిరి పోలీసులకు సమాచారం అందించగా, మల్కన్‌గిరి ఐఐసీ రీగాన్‌కీండో, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సమీపంలో 2 ప్లాస్టిక్ గ్రాసులు కనిపించడంతో విషయం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.