
మాట్లాడుతున్న సీడీఎంఓ జగదీష్ పట్నాయక్
బరంపురం: ప్రజల్లో టీబీ వ్యాధిపై మరింత చైతన్యం అవసరమని, ముందస్తు అవగాహనతోనే వ్యాధిని నియంత్రించవచ్చని జిల్లా ముఖ్య ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వర్ పట్నాయక్ సూచించారు. నగరంలోని సిటీ ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఐఎంఈ హాలులో జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ టీబీ నివారణ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి 3నిమిషాలకు ఒకరు టీబీతో మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యాధిపై అవగాహనతో పాటు ప్రతి ఒక్కరినీ చైతన్యవంతం చేసే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆరోగ్యశాఖ సహాయ అధికారి ఉమకాంత్ మిశ్రా మాట్లాడుతూ గతంలో క్షయ వ్యాధికి మందులు ఉండేవి కావని, ప్రస్తుతం ప్రభుత్వం వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తోందని తెలిపారు. బాధితులు ఆందోళనకు గురికాకుండా వైద్యుల సూచనతో క్రమం తప్పకుండా మందులు వినియోగిస్తే వ్యాధిని తరిమికొట్ట వచ్చని వివరించారు. అంతకుముందు స్థానిక సీడీఎం కార్యాలయం నుంచి సిటీ ఆస్పత్రి వైద్యులు, ఎంకేసీజీ కళాశాల సిబ్బంది నరగంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే నగరంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై చైతన్య ర్యాలీ చేపట్టారు. స్థానిక సిద్ధార్థ క్లీనిక్‌లో డాక్టర్ జమ్ముల నారాయణరావు ఆధ్వర్యంలో అవగాహన శిబిరం నిర్వహించారు.
వైద్యుల సూచనలు..
రాయగడ: ప్రపంచ క్షయ రోగ నివారణ దినోత్సవాన్ని జిల్లా ఆరోగ్యశాఖ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా క్షయ, నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే జిల్లా ముఖ్యవైద్యాధికారి ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రచార రథాన్ని ప్రారంభించారు. పట్టణంలోని అన్నివీధుల్లో ఈ రథం తిరుగుతూ క్షయరోగ నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనుందన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
తనిఖీలు తప్పనిసరి..
పర్లాకిమిడి: సకాలంలో మందులు తీసుకుంటే క్షయ వ్యాధిని నివారించవచ్చని జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్‌కుమార్ పాత్రొ సూచించారు. పర్లాకిమిడి లోని జిల్లా కేంద్రాస్పత్రి నుంచి పట్టణంలోని పలు కూడళ్లలో బినోదిని సైన్స్ కళాశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీడీఎంఓ కార్యాలయంలో టీబీ నిపుణులు డాక్టర్ రఘనారాయణ దాస్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాధి తీవ్రతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రోగులు డాట్ కోర్సు మందులు వాడుతున్నా.. ప్రతి 2 నెలలకు ఒకసారి తనిఖీ చేయించుకోవాలన్నారు. అలాగే క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని డీపీహెచ్‌ఓ డాక్టర్ ఎంఎం అలీ తెలిపారు. జిల్లాకేంద్రంలో టీబీ రెసిస్టన్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు జిల్లా టీబీహెచ్ సమన్వయకర్త కె.అమర్‌నాథ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఎం సౌమ్యారాణి గౌడో, జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ ఇందిరా మహాపాత్రొ తదితరులు పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైన వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చైతన్య ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
రాయగడ: చైతన్య రథంతో ఆరోగ్య సిబ్బంది
గంజాం సీడీఎంతో జగదీశ్వర్ పట్నాయక్
టీబీ నియంత్రణపై జిల్లాల్లో చైతన్య శిబిరాలు




పర్లాకిమిడి: సూచనలందిస్తున్న సీడీఎంఓ డాక్టర్ పీకే పాత్రొ