
దొంగతనం జరిగిన ఇంటి వద్ద క్లూస్ టీం సిబ్బంది, స్థానికులు
● పది తులాల బంగారం, అరకేజీ వెండి, రూ.20 వేల నగదు చోరీ
● బావరాజుపాలెంలో ఘటన
రణస్థలం: పట్టపగలే ఓ ఇంట్లో దొంగలుపడ్డారు. బంగారు వెండి ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. రణస్థలంలోని జె.ఆర్.పురం సమీపంలో బావరాజుపాలెంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుగ్గు గోవింద అనే వ్యాపారి జె.ఆర్.పురంలో బ్యాంగిల్ షాపు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం 9 గంటలకు షాపు తెరిచేందుకు వెళ్లిపోయారు. ఇంటి పనులన్నీ పూర్తయ్యాక అతని భార్య శ్యామల కూడా 11 గంటల సమయంలో షాపు వద్ద వెళ్లారు. అప్పటికే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి సమీపంలోని కొబ్బరి తోటలో మాటువేశారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక వారిలో ఇద్దరు ఇంటి గడియను కటర్‌తో పగలుకొట్టి లోపలికి ప్రవేశించారు. ఓ వ్యక్తి బయటే బైక్‌తో సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో పొరుగింటి మహిళ కామన్‌గా ఉన్న తాగునీటి బోరు మోటార్ వేసేందుకు గోవింద ఇంటికి వచ్చింది. ఈ అలజడితో ఇంటి నుంచి ఇద్దరు వ్యక్తులు నిదానంగా బయటకు నడుచుకుని వచ్చి బైక్‌పై సిద్ధంగా ఉన్న వ్యక్తితో కలిసి క్షణాల్లో పరారయ్యారు. ఇంటి తలుపు గడియలు విరిగి ఉండటాన్ని గమనించిన మహిళ వెంటనే గోవిందకు సమాచారం అందించింది. వారు వచ్చి చూసేసరికి బీరువాలో 10 తులాల బంగారం, అర కేజీ వెండి, రూ.20 వేలు నగదు కనిపించలేదు. వెంటనే జె.ఆర్.పురం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ మత్తే మహేంద్ర, సీఐ ఎస్.ఆదాం, క్లూస్ టీం సిబ్బంది పరిశీలించి వివరాలు సేకరించారు. ఎస్సై జి.రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బీరువా వద్ద వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్ టీం