పార్వతీపురం: వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని పిల్లలు, గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే వడ్డించాలని కలెక్టర్ నిషాంత్ కుమార్ ఆదేశించారు. మహిళా శిశుసంక్షేమశాఖ ప్రాజెక్టు అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య తగ్గించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు కీలకభూమిక పోషించాలన్నారు. సీతంపేట, కురుపాం, భద్రగిరి, పార్వతీపురం ప్రాజెక్టు పరిధిలో పిల్లలు, గర్భిణుల హాజరు తక్కువుగా ఉందని, దీనిపై దృష్టిసారించాలని సూచించారు. పునరుత్పత్తి, చిన్నారుల ఆరోగ్య గుర్తింపుకార్డు (ఆర్‌సీహెచ్ ఐడీ) మ్యాపింగ్ ప్రక్రియను ఈ నెల 25 నాటికి పూర్తిచేయాలన్నారు. ఆరేళ్లలోపు వయస్సుగల పిల్లల ఆధార్‌కార్డులను శనివారం నాటికి అప్‌డేట్ చేయాలని సూచించారు. వీడియో కాన్ఫిరెన్స్‌లో ఐసీడీఎస్ పీడీ కె.విజయగౌరి పాల్గొన్నారు.