
ప్రేమశ్రీ, కల్యాణిలను అభినందిస్తున్న ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి, పక్కనే అర్జున్‌రెడ్డి
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్థాయి సెపక్‌తక్ర శిక్షణ శిబిరాలకు శ్రీకాకుళం జిల్లా నుంచి మహిళల విభాగంలో ఎస్.ప్రేమశ్రీ, పి.కల్యాణి ఎంపికయ్యారు. ఇటీవల నంధ్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి సపక్‌తక్ర చాంపియన్‌షిప్ పోటీల్లో ఉత్తమ ఆటతీరును కనబర్చిన క్రీడాకారులను నేషనల్ మీట్‌లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికచేశారు. వీరికి ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ కోచింగ్ క్యాంప్‌లో రాణించిన ప్లేయర్స్ ఏప్రిల్ 1 నుంచి 5వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగే జాతీయస్థాయి సెపక్‌తక్ర చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల జట్టుకు ఎంపికవుతారని జిల్లా సెపక్‌తక్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కోచ్ జి.అర్జున్‌రావురెడ్డి తెలిపారు. ఎంపికై నవారిలో శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రేమశ్రీ ఇంటర్ సెకండియర్ చదువుతుండగా శ్రీకాకుళం రూరల్ పాత్రునివలసకు చెందిన పి.కళ్యాణి డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. వీరిద్దరూ ఒంగోలు కోచింగ్ క్యాంప్‌లో చేరేందుకు శుక్రవారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లారు. వీరిద్దరిని శ్రీకాకుళం సెపక్‌తక్ర అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి వీడ్కోలు పలికి అభినందించారు. పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించారు.