
● బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా మన్మోహన్ సామల్ ● మూడోసారి పార్టీ పగ్గాలు అప్పగించిన అధిష్టానం
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడు నియమితులయ్యారు. సీనియర్ నాయకుడు, మాజీమంత్రి మన్మోహన్ సామల్‌ను నియమిస్తున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యాలయ వర్గాలు గురువారం ప్రకటించాయి. రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా సామల్ నియమితులు కావడం ఇది మూడోసారి కావడం విశేషం. 64 ఏళ్ల ఆయన.. సంస్థాగత నైపుణ్యత లక్షణాలతో సంక్లిష్ట పరిస్థితులను అవలీలగా అధిగమించే నాయకుడిగా పేరొందారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఈ నియామకం అత్యంత కీలకంగా రాజకీయ శిబిరాల్లో చర్చ సాగుతోంది. కీలకమైన పరిస్థితుల్లో గట్టి నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన కేంద్ర నాయకత్వానికి సామల్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని, వారి కోరికను నెరవేర్చేందుకు అంతా సమష్టి కృషి, నాయకత్వం, నిర్ణయంతో ముందడుగు వేస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో శక్తిమేరకు పోరాడి, ప్రజాభీష్టంతో బీజేపీ అధికారంలో ప్రభుత్వాన్ని తీసుకు వస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమీర్ మహంతి మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో కొత్త అధ్యక్షుడిని నియమించినట్లు పార్టీ నాయకుడు, రెంగాలి ఎమ్మెల్యే నౌరీ నాయక్ తెలిపారు. ఆయన నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో ధీటైన పోటీతో ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ పాణిగ్రాహి అన్నారు.
●గత ఏడాది నవంబర్‌లో జరిగిన ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పార్టీ విజయంలో సామల్ కీలక పాత్రధారిగా గుర్తింపు పొందారు.
● కోస్తా జిల్లా భద్రక్ నుంచి 2004లో ఒడిశా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
● బీజేడీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2008 వరకు రెవెన్యూ, ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
● పదవీ కాలంలో పలు శాసనసభ కమిటీలకు అధ్యక్షుడిగా, సభ్యుడిగా నియమితులై, పనితీరును చాటుకున్నారు.
● ఈ వ్యవధిలో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు.

మన్మోహన్ సామల్