
గంజాయితో పట్టుబడిన నిందితులు
భువనేశ్వర్: ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఖుర్దారోడ్ రైల్వే డివిజన్ పరిధి ఖుర్దా రోడ్, కై పాదర్ స్టేషన్ల మధ్య ఉన్న తపాంగ్ యార్డులో గురువారం మధ్యాహ్నం 2.25 గంటలకు గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. గూడ్స్‌రైలు క్రాసింగ్‌ను దాటుతుండగా వెనుక ట్రాలీ పట్టాలు తప్పింది. హౌరా–చైన్నె ప్రధాన రైలు మార్గంలో ఈ ప్రమాదం సంభవించడంతో రైలు రవాణా ప్రభావితమైంది. పునరుద్ధరణ పనులు పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో రైలు రవాణా నియంత్రించారు. భువనేశ్వర్–ముంబై సీఎస్‌ఎంటీ(11020) కోణార్క్ ఎక్స్‌ప్రెస్, హౌరా–సికింద్రాబాద్(12703) ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్‌లో.. పాండిచ్చేరి–హౌరా(12868) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కలుపడాఘాట్, చైన్నె–హౌరా మెయిల్(12840) చిలికా, చైన్నె–షాలిమార్(22826) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఖలికోట్, పాండిచ్చేరి–భువనేశ్వర్(12897) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బరంపురం రైల్వేస్టేషన్లలో నియంత్రించారు. పూరీ–గుణుపురం(18417) ప్రత్యేక రైలును అక్కడక్కడ నిలుపుదల చేస్తూ ముందుకు నడిపించారు. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణహాని లేదని తూర్పుకోస్తా రైల్వే అధికార వర్గాలు స్పష్టం చేశాయి. యాక్సిడెంట్ రిలీఫ్ రైలు తక్షణమే ప్రమాద స్థలానికి చేరి పునరుద్ధరణ కార్యకలాపాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ప్రమాదానికి గురైన గూడ్సురైలు ముందు భాగాన్ని వేరు చేసి, పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. సాయంత్రం 4.50 గంటల నుంచి రైలు రవాణా యథాతధంగా కొనసాగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
66కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితిలో బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న చిత్రకొండ పోలీసులు ఎస్‌ఆర్ కూడలి వద్ద 66 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. చిత్రకొండ సమితి తటమాన్‌పల్లి గ్రామానికి చెందిన సంతోష్ ఖీలో, మరొకరు మైనర్‌గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి, నిందితులను గురువారం మల్కన్‌గిరి కోర్టులో హాజరు పరిచారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.50 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
‘అవినీతి నిర్మూలనకు
కృషి చేస్తా’
జయపురం: అఖిల భారత భ్రష్టాచార విరోద ఘటన కొరాపుట్ జిల్లాశాఖ అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది, నవరంగపూర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్ మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర పర్యవేక్షకుడు సుభ్రతకుమార్ నందో ఈ విషయాన్ని వెల్లడించారు. కొరాపుట్ జిల్లాలో అమలు జరుగుతున్న వివిధ ప్రభుత్వ జనకల్యాణ సంక్షేమ పథకాలలో అవినీతిని నిరోదించడంతో పాటు అక్రమాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తానని ఈ సందర్భంగా అశోక్ మిశ్రా తెలిపారు. అలాగే అన్ని సమితిలు, తాలుకాల్లో పర్యటించి, కమిటీలు ఏర్పాటు చేస్తానని వివరించారు.
మావోయిస్టు డంప్ స్వాధీనం
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి లారిగూడ, తైమాల్ గ్రామాల మధ్య ఉన్న అడవిలో 88 బెటాలియన్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్లు గురువారం ఉదయం కూబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు అమర్చిన డంప్ పట్టుబడింది. ఇందులో 3 ఐఈడీ బాంబులు, ఎస్‌బీఎంఎల్ తుపాకులు 2, ఎస్‌బీఎంఎల్ బ్యారెల్ 1, ఎస్‌బీఎంఎల్ ఖాళీ కేసు 1, 36 హెచ్‌ఈ గ్రెనేడ్ 11, నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు 28, వాకీటాకీలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల అణచివేతకు గాను జవాన్లు ఆపరేషన్ ప్రారంభించిన తొలి రోజు భారీ డంప్ పట్టుబడటం పట్ల జిల్లా ఎస్పీ నితీష్ వాధ్వనీ అభినందనలు తెలియజేశారు.

పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్