భువనేశ్వర్: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ 3 రోజుల రాష్ట్ర పర్యటన గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా నవీన్ నివాస్ సందర్శించి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. వీరివురి భేటీ పట్ల రాజకీయ చర్చ ఊపందుకుంది. అయితే ఈ భేటీ సౌజన్యాత్మకమని ఇరువురు ముఖ్యమంత్రులు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మమత.. నవీన్‌ను అగ్రశ్రేణి నాయకుడని కొనియాడారు. 3 రోజుల పర్యటనలో అత్యంత ఆత్మీయత, అనురాగాలతో చక్కటి ఆతిథ్యం కల్పించారని సంతృప్తి వ్యక్తంచేశారు. భారతదేశ సమాఖ్య(ఫెడరలిజం) వ్యవస్థ శాశ్వతంగా, బలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ భేటీ సౌజన్యాత్మకం కావడంతో రాజకీయ విషయాలపై లోతైన చర్చ జరగలేదని తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ అధినేత్రి తెలిపారు. పటిష్టమైన సురక్షిత సమాఖ్య ఆవిష్కరణలో నవీన్‌కు ఎల్లప్పుడూ తనవంతు మద్దతు ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుతం ఎటువంటి రాజకీయ ప్రశ్నలకు బదులు ఇచ్చేది లేదన్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు రాజకీయ ప్రశ్నల గురించి నన్ను అడిగితే ప్రశ్నలన్నింటికీ బంగారు లాంటి సమాధానం ఇస్తానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్థానిక మీడియాను చమత్కరించి దాట వేశారు.
ముగిసిన మమతా బెనర్జీ రాష్ట్ర పర్యటన