మామిడి రైతులకు తీపి కబురు

- - Sakshi

మామిడి దిగుబడులు ఒకే చోటకు చేర్చి ధర వచ్చేటప్పుడు విక్రయించుకునేలా చేసేందుకు మామిడి సేకరణ కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇప్పటికే నాలుగు చోట్ల వీటి నిర్మాణాలు పూర్తయ్యాయి. 16 నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి ద్వారా ఉద్యానవన పంటల రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది.

జామి: ఉద్యానవన పంటలు పండించే రైతులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు దళారీ వ్యవస్థకు చెక్‌ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రాయితీల వరాలు కురిపించి ఉద్యానవన రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలని నిర్ణయించింది. ముఖ్యంగా మామిడి రైతులను ఆదుకునే విధంగా మామిడి సేకరణ కేంద్రాల నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మామిడి రైతులు దళారీల బారిన పడకుండా రైతులకు నష్టం వాటిల్లకుండా ఈ సెంటర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది.

ప్రభుత్వ రాయితీ రూ.11.25 లక్షలు

జిల్లాలో ప్రభుత్వం 20 మామిడి సేకరణ కేంద్రాలు మంజూరు చేసింది. వాటిలో నాలుగు కేంద్రాల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 16 కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఒక్కో ఎంసీసీ నిర్మాణానికి రూ.15 లక్షల వ్యయం కానుంది. ఇందులో ప్రభుత్వం రాయితీ రూ.11.25 లక్షలు మంజూరు చేస్తుంది. ఎఫ్‌పీఓ వాటా రూ.3.75 లక్షలు మామిడి రైతులు చెల్లించాలి. మామిడి రైతులు ఉద్యానవన శాఖ ద్వారా గుర్తింపు పత్రం తీసుకుని, 100మంది రైతులు కలిసి ఒక సంఘంగా ఏర్పాటు కావాలి. అటువంటి ఒక సంఘానికి ఒక ఎంసీసీ మంజూరు చేస్తారు.

ఎంసీసీలతో ప్రయోజనాలు

రైతులు, కౌలు రైతులు తాము పండించిన పంటను ఎంసీసీల వద్దకు తరలించి, నిల్వ చేసుకుని మామిడి అమ్మకాలు సాగించవచ్చు. రైతులు తమ పంటను ఒకే కేంద్రం వద్దకు తరలిస్తే ముఖ్యంగా రైతులకు మంచి ధర వస్తుంది, కేంద్రం వద్ద గ్రేడ్‌లు వారీగా విభజించి గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా విక్రయాలు జరపవచ్చు. గతంలో రైతులు సొంతంగా అమ్మకాలు సాగిస్తే దళారులు తమకు నచ్చిన ధరకు తీసుకునే వారు. దీంతో మామిడి రైతులు నష్టపోయేవారు. ఎంసీసీల ద్వారా అమ్మకాలు సాగిస్తే అందరికి ఒకే రకమైన ధర వస్తుంది. ముఖ్యంగా దళారుల బెడద ఉండదు. మామిడి పంటనే కాక ఉద్యానవన పంటలు, కూరగాయలు కూడా అమ్మకాలు చేయవచ్చు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఎంసీసీల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా దళారులను నియంత్రించడానికి ఈ సేకరణ కేంద్రాలు ఉపకరిస్తాయి.

రెండు జిల్లాల రైతులకు..

లొట్లపల్లి పంచాయతీలో నిర్మించిన మామిడి సేకరణ కేంద్రం విజయగనరం, విశాఖ జిల్లాలకు చెందిన సుమారు ఐదు వేల మంది మామిడి రైతులు వినియోగించుకోనున్నారు. విజయగనరం జిల్లాలో జామి, ఎస్‌.కోట, కొత్తవలస, వేపాడ, ఎల్‌.కోట, గంట్యాడ, విజయగనరం తదితర మండలాలు, విశాఖపట్నం జిల్లాకు చెందిన పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, కోటపాడు తదితర మండలాలకు చెందిన రైతులకు లొట్లపల్లిలోని మామిడి సేకరణ కేంద్రం వినియోగపడనుంది.

30,720 హెక్టార్లలో సాగు

జిల్లాలో మామిడి పంటను 30,720 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం ఉద్యానవన శాఖకు అందిస్తున్న ప్రోత్సహంతో సుమారు 400 హెక్టార్లలో మామిడి సాగును విస్తరించారు. జిల్లాలో ఏడాదికి సరాసరి 3,07,200 మెట్రిక్‌ టన్నులు మామిడి దిగుబడులు సాధిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పండించిన మామిడి ఉత్పత్తులు రాయపూర్‌, బరంపురం, కోల్‌కత్తా, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి.

జిల్లాలో 20 మామిడి సేకరణ కేంద్రాలు

ఒక్కో కేంద్రానికి రూ.15లక్షలు

రూ.11.25 లక్షల ప్రభుత్వం రాయితీ

రైతులకు గిట్టుబాటు ధరే లక్ష్యం

దళారీ వ్యవస్థకు చెక్‌

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top