ఆపితే ఆపదే..! | Sakshi
Sakshi News home page

ఆపితే ఆపదే..!

Published Fri, Mar 24 2023 5:48 AM

- - Sakshi

జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తులు..

సంవత్సరం వ్యాధిగ్రస్తులు

2019 4383

2020 2405

2021 3446

2022 3320

2023 560

నరసన్నపేట: ఎడతెరిపినివ్వని దగ్గు.. ఆకలి మందగించడం..ఛాతినొప్పి..విపరీతమైన అలసట..ఇవన్నీ క్షయ(టీబీ) లక్షణాలే. ఈ వ్యాధి బారిన పడిన వారు వైద్యుల సూచనలు పాటిస్తూ ప్రభుత్వం అందజేస్తున్న మందులు క్రమం తప్పకుండా వినియోగిస్తే వ్యాధి నుంచి సులువుగానే బయటపడవచ్చు. అయితే చాలామంది మందులు సగంలోనే మానేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఏమాత్రం అలసత్వం వహించినా ప్రాణానికి ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం ప్రపంచ క్షయ దినం సందర్భంగా ప్రత్యేక కథనం.

క్షయ కారణాలివే..

క్షయ అంటు వ్యాధి. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే కొంత కాలంగా మొదడు, ఎముకలు, మూత్రపిండాలు, పేగులు, చర్మం తదితర అవయవాలు ప్రభావితమై ప్రాణాంతకంగా నిలుస్తోంది. ఊపిరితిత్తులు శ్వాసకోశ వ్యవస్థ దెబ్బ తినడం వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వం ఉచితంగా అందించే మందులు వాడి పోషక విలువతో కూడిన ఆహారం తీసుకుంటే వ్యాధి నుంచి బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, కిడ్నీ, హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌ బాధితులు, పోషకాహారం లోపంతో ఉన్నవారు, సిలికోసిస్‌ వ్యాధి కలిగి ఉన్న వారు, ఆర్థరైటీస్‌, సోరియాసిస్‌ బాధితులు ఎక్కువగా వ్యాధి బారిన పడే అవకాశముంది. క్షయ రోగులు ఎక్కువగా వెలుతురు ఉన్న గదుల్లో ఉండాలి. రోగికి వీలైనంత ఎక్కువ దూరంలో ఉండటం శ్రేయస్కరం. నిత్యం మాస్క్‌ వాడేలా చూడాలి. పుట్టిన బిడ్డకు ఇరవై ఒక్క రోజుల్లోగా టీబీ టీకా వేయించాలి.

ఉచితంగా మందులు..

జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులో వ్యాధి నిర్థారణ పరీక్షలు చేసుకోవచ్చు. మాంటెక్స్‌ అనే చర్మ పరీక్ష ద్వారా గానీ, ఛాతికి ఎక్స్‌రే తీసి గానీ, రోగి నోటి నుంచి ఉదయం తీసిన కఫాన్ని పరీక్ష చేయడం ద్వారా గానీ వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మందులు సరఫరా చేస్తుంది. ప్రత్యేక ట్రాకింగ్‌ సిస్టం ద్వారా వారికి మందుల సరఫరా, వాటి వినియోగాన్ని వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రోగులకు రెండు కేటగిరీల ద్వారా చికిత్స ప్రభుత్వం అందిస్తుంది. క్షయ రోగులకు పౌష్టికాహార ఖర్చుల కోసం నెలకు రూ.700 చొప్పున ఆరు నెలలు చెల్లిస్తున్నారు.

జిల్లాకు వరుస అవార్డులు

క్షయ వ్యాధి రోగుల శాతాన్ని 20 శాతం మేరకు తగ్గించినందుకు 2021, 2022 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి శ్రీకాకుళం జిల్లాకు వరుసగా రెండు కాంస్య పతకాలు వచ్చాయి. దీనిని స్పూర్తిగా తీసుకొని జిల్లా క్షయ నివారణ సంస్థ సిబ్బంది పనిచేస్తున్నారు.

మందులు క్రమం తప్పకుండా వాడాలి..

జిల్లాలో క్షయ వ్యాధిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. రోగులు క్రమం తప్పకుండా మందులు వినియోగించాలి. చాలా మంది పూర్తి కోర్సు వాడటం లేదు. కొన్నాళ్లు వాడి మానేస్తున్నారు. ఇటువంటి వారి వల్లే వ్యాధి వ్యాపిస్తుంది. మందులు వాడేందుకు ఆయా గ్రామాల్లో ఆశ వర్కర్‌, ఏఎన్‌ఎంకు ట్రాకింగ్‌ బాధ్యతలు అప్పగిస్తున్నాం. పోషకాలు కలిగిన ఆహరం తీసుకోవడం ద్వారా వ్యాధి నుంచి బయట పడవచ్చు. – ఎన్‌.అనూరాధ,

క్షయ నివారణ అధికారి, శ్రీకాకుళం

మందుల వాడకాన్ని సగంలోనే మానేస్తున్న క్షయరోగులు

ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న వైనం

ప్రత్యేక ట్రాకింగ్‌ సిస్టంను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం

జిల్లాలో తగ్గుతున్న టీబీ కేసులు

నేడు ప్రపంచ క్షయ(టీబీ) దినం

క్షయ నివారణకు అందరూ సహకరించాలి

అరసవల్లి: జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు అందరూ సహకరించాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.మీనాక్షి, టీబీ కంట్రోల్‌ అధికారి డాక్టర్‌ ఎన్‌.అనూరాధ కోరారు. ప్రపంచ క్షయ నివారణ దినం నేపథ్యంలో గురువారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. క్షయ వ్యాధి పట్ల మరింత అవగాహన కల్పించేందుకు, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వ సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకురావాలని పిలుపునిచ్చారు. క్షయవ్యాధి అంటు వ్యాధి అని, మైక్రోబ్యాక్టీరియా ట్యూబర్‌క్లోసిన్‌ అనే స్మూక్షజీవి ద్వారా సంక్రమిస్తుందన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, ఆయాసం, బరువు తగ్గటం, కఫంలో రక్తం పడటం, ఛాతి నొప్పి, సాయంకాల జ్వరం, రాత్రి పూట నిద్రలో చెమటలు పట్టడం తదితర లక్షణాలు ఉంటాయని వివరించారు. గతేడాది 3260 క్షయ కేసులు జిల్లాలో నమోదయ్యాయని, వీటిలో 74 వరకు మొండి క్షయ కేసులున్నాయని, వీటిని నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు. ఆరు నెలల పాటు మందులు వాడితే రోగాన్ని జయించవచ్చునన్నారు. మధుమేహం, క్యాన్సర్‌, స్టెరాయిడ్స్‌ వినియోగించే రోగులు, మందు సేవించిన వారికి క్షయ వచ్చే అవకాశముందన్నారు. జిల్లాలో అన్ని సీహెచ్‌సీల్లోనూ క్షయ నిర్థారణ పరీక్షలకు తగిన సౌకర్యాలున్నాయని, మొత్తం జిల్లాలో 12 క్షయ నివారణ యూనిట్లు, 31 కఫం పరీక్ష కేంద్రాలున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి క్షయ రోగికి నెలకు రూ.500, ఇతర సంస్థల తరపున రూ.700 వరకు అందిస్తున్నామన్నారు. జిల్లాలో అన్ని స్వచ్ఛంధ సంస్థలు ముందుకు వచ్చి క్షయరోగుల సంక్షేమం,, నివారణ చర్యల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న మీనాక్షి, అనూరాధ
1/2

మాట్లాడుతున్న మీనాక్షి, అనూరాధ

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement