
త్వరగా పూర్తి చేయండి
అభివృద్ధి పనులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఈవో శీనానాయక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలోని అభివృద్ధి పనులను ఈవో మంగళవారం పరిశీలించారు. ప్రాంగణంలో నిర్మిస్తున్న పూజా మండపాన్ని పరిశీలించారు. ప్లాన్ ప్రకారం ఇంకా జరగాల్సిన పనులు, రెండో అంతస్తును తనిఖీ చేశారు. దాతల సహకారంతో నిర్మించిన నూతన యాగశాల తుది పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయనే వివరాలను ఈఈ కోటేశ్వర రావును అడిగి తెలుసుకున్నారు. మల్లేశ్వరస్వామి ఆలయం చుట్టూ పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు. నూతన పూజా మండపాలు, యాగశాలను త్వరగా విని యోగంలోకి తీసుకురావాలని సూచించారు. అభివృద్ధి పనులు పూర్తయ్యేలా కాంట్రాక్టర్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని, రోజువారీ సమీక్షించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈవో వెంట ఈఈ కోటేశ్వరరావు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
కమిషనర్ సమీక్ష
దుర్గగుడి ఈవో శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు, ఇతర ఆలయ అధికారులు మంగళవారం కమిషనర్ రామచంద్రమోహన్‌తో సమావేశమయ్యారు. గొల్లపూడిలోని దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఆలయంలో జరుగుతున్న పనులతో పాటు భవిష్యత్తు ప్రణాళికలపై ఈవోతో చర్చించినట్లు సమాచారం.
దుర్గగుడి ఈఓ శీనానాయక్