
2024లో రూ.21.15 లక్షల కోట్ల ఆదాయం
దేశీయ పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి అనంతరం పర్యాటకం తిరిగి పూర్వ స్థాయిని మించి పుంజుకుంది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకం రెండూ బలంగా విస్తరిస్తున్నప్పటికీ, వసతి మౌలిక సదుపాయాలలో గణనీయమైన కొరత ఉందని నీతిఆయోగ్ తాజా నివేదికలో స్పష్టం చేసింది.
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం పీక్ సీజన్లలో దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా హోటల్ గదుల కొరత ఉంటుందని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో హోమ్ స్టేలు కీలక ప్రత్యామ్నాయంగా మారుతున్నాయని, వాటి విస్తరణకు మరిన్ని మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. –సాక్షి, అమరావతి
ప్రత్యామ్నాయ వసతి రంగం పురోగతి
పర్యాటక రంగం విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో వసతి మౌలిక సదుపాయాల లోటును భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ వసతి కీలక పరిష్కారంగా నిలుస్తోంది. కొత్త హోటళ్ల నిర్మాణానికి అధిక పెట్టుబడి, నియంత్రణ ఆమోదాలు, భూమి లభ్యత అవసరం. అయితే, హోమ్ స్టేలు తక్కువ ఖర్చుతోనే చక్కటి వసతి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రత్యేకించి మారుమూల ప్రాంతాలు, ద్వితీయ–తృతీయ శ్రేణి నగరాలకు ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. పర్యావరణ స్పృహ, కమ్యూనిటీ ఆధారిత పర్యాటకంతో వీటిని అనుసంధానం చేయాలని నివేదిక సూచించింది.
హోమ్ స్టేల కోసం కేంద్రం, రాష్ట్రాలు ఒక నమూనా విధానం రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. నివేదిక సిఫారసు చేసిన అంశాల్లో.. కొత్త ఆపరేటర్లకు సాంకేతిక సహాయం, ప్రాజెక్టు నిర్వహణ నైపుణ్యం, ఉత్తమ పద్ధతులపై మార్గదర్శకం, ఆర్థిక, ఆర్థికేతర రాయితీలు, గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక మద్దతు, నీరు, విద్యుత్, ఆస్తి పన్నులలో నివాస రేట్ల రాయితీలు, హోమ్ స్టే రిజి్రస్టేషన్ కోసం సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ ఏర్పాటు వంటివి ఉన్నాయి.
నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు..
» 2024లో ప్రయాణ–పర్యాటక రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.21.15 లక్షల కోట్లు అందించింది. ఇది 2019తో పోలిస్తే 21 శాతం పెరుగుదల.
» వచ్చే దశాబ్దంలో ఈ రంగం రూ.43.25 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థకు అందజేస్తుంది. ఇది దేశ జీడీపీలో 7.6 శాతంగా ఉంటుంది.
» 2024లో దేశీయ పర్యాటకులు రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇది 2019తో పోలిస్తే దాదాపు 25 శాతం అధికం. 2034 నాటికి ఈ ఖర్చు రూ.28.70 లక్షల కోట్లు చేరనుంది.
» అంతర్జాతీయ పర్యాటకులు 2024లో రూ.2.85 లక్షల కోట్లు ఖర్చు చేయగా, 2034 నాటికి అది రూ.4.07 లక్షల కోట్లు దాటుతుందని అంచనా.
» ప్రస్తుతం పర్యాటక రంగంలో 4.32 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. అంటే, ప్రతి 11 ఉద్యోగాలలో ఒకటి ఈ రంగానిదే. 2034 నాటికి ఈ రంగంలో ఉపాధి 6.3 కోట్లకు పెరుగుతుంది.
» పర్యాటకుల అభిరుచులు కూడా మారుతున్నాయి. సుదీర్ఘమైన, ప్రయోజనకరమైన ప్రయాణాలపై వారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
» 87 శాతం మంది పర్యాటకులు కొత్త గమ్యస్థానాల్లో పర్యటించి, ఆ అనుభూతులను పదిలపరచుకోడానికి దీర్ఘకాల పర్యటనలను కోరుకుంటున్నారు.
» వర్కేషన్స్ (విహార ప్రదేశంలో ఉంటూ పని చేయడం), డిజిటల్ నోమాడ్ (స్థిర నివాసం లేకుండా, ప్రపంచంలోని ఏ ప్రదేశం నుంచైనా ఆన్‌లైన్‌లో పని చేసేవాడు) సంస్కృతి పెరుగుతున్నందున దీర్ఘకాల వసతిపై డిమాండ్ పెరిగింది.
» హోమ్ స్టేలు, ఆఫ్‌బీట్ అలాగే గ్రామీణ పర్యాటకం వేగంగా విస్తరిస్తున్నాయి. దేశీయ హోమ్ స్టే మార్కెట్ 2024లో రూ.4,722 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
» ఈ మారుతున్న ధోరణులు పర్యావరణ హిత, వెల్‌నెస్ టూరిజం, గ్రామీణ హోమ్ స్టేల వంటి ప్రత్యామ్నాయ పర్యాటక నమూనాలకు దారి తీస్తున్నాయి.