ఎస్‌ఐఆర్‌పై సుప్రీం కోర్టులో నేడు బిగ్‌ డే! | SIR Petitions Gyanesh Kumar Row: Supreme Court to Hear Key Cases Today | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌పై సుప్రీం కోర్టులో నేడు బిగ్‌ డే!

Oct 15 2026 9:21 AM | Updated on Oct 15 2026 9:25 AM

SIR Petitions Gyanesh Kumar Row: Supreme Court to Hear Key Cases Today

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరపనుంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో పాటు పలువురు విపక్ష నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్‌ కూడా విచారణకు రానుంది. ఈ కేసులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. 

ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, మార్పులపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించడంతోపాటు, జాబితాలో మార్పులు చేయడంలో అక్రమాలు జరిగాయనేది రాహుల్‌గాంధీ, ఇతర విపక్ష నేతల ప్రధాన ఆరోపణ. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలూ ఇందులో ఉన్నాయి. ఈ వ్యవహారంపై స్వతంత్రంగా విచారణ జరిపించాలని వారు సుప్రీంకోర్టును కోరారు. ఇందుకోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో, సాంకేతిక నిపుణులు, ప్రముఖులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

ఎస్‌ఐఆర్‌ సందర్భంగా ఓటర్ల జాబితాలో చేసిన తొలగింపులు, మార్పులను నిర్దిష్ట గడువులోగా ఆడిట్‌ చేయాలని కోరారు. ఈ ప్రక్రియకు సంబంధించిన ఎన్నికల సంఘం రికార్డులు, సమావేశాల వివరాలు, అభ్యంతరాలు, డిజిటల్‌ యాక్సెస్‌ లాగ్‌లను పరిశీలనకు అందుబాటులో ఉంచాలని కూడా పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. తగిన నోటీసు ఇవ్వకుండా, తమ వాదన వినకుండా ఏ ఓటరు పేరునూ తొలగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

సర్‌ను సవాలు చేసిన ఒవైసీ
ఎస్‌ఐఆర్‌ నిర్వహిస్తున్న తీరును సవాలు చేస్తూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌ను రాహుల్‌గాంధీ తదితరుల పిటిషన్లతో కలిపి విచారించాలని ఆయన తరఫు న్యాయవాది కోరడంతో, గురువారం విచారణకు జాబితా చేసేందుకు ధర్మాసనం అంగీకరించింది. దీంతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన వేర్వేరు అభ్యంతరాలు అత్యున్నత న్యాయస్థానం ముందుకు రానున్నాయి.

ఢిల్లీ నిరసనలపై పిటిషన్లూ విచారణకు..
మరోవైపు, అక్టోబర్‌ 10న ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల నేపథ్యంలో విధించిన ఆంక్షలపై దాఖలైన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు విచారించనుంది. నిరసనల సమయంలో మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రాకపోకలకు అంతరాయం, పోలీసుల చర్యలకు సంబంధించిన అంశాలు ఈ పిటిషన్లలో ఉన్నాయి.

నిరసనలను కవర్‌ చేస్తున్న మహిళా జర్నలిస్టులపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలపైనా గత విచారణలో సుప్రీంకోర్టు స్పందించింది. ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు సీనియర్‌ ఢిల్లీ పోలీసు అధికారిని హాజరుకావాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై నివేదిక సమర్పించాలని, సంబంధిత పిటిషన్లకు సమాధానాలు ఇవ్వాలని కూడా సూచించింది. ఈ కేసుల విచారణను కూడా నేటికి(అక్టోబర్‌ 15)కు వాయిదా వేసింది.

ఢిల్లీ ఎస్‌ఐఆర్‌లో ఫారం-6 వివాదంపై వేరుగా..
ఢిల్లీలో ఎస్‌ఐఆర్‌ సందర్భంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించినవారు తిరిగి పేర్లు చేర్చుకోవడానికి కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫారం-6 సమర్పించాలని కోరుతున్నారంటూ మరో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై అక్టోబర్‌ 14న విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. కాకుంటే.. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్‌ 28కి వాయిదా వేసింది.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై విపక్షాల అభ్యంతరాలు, ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఢిల్లీ నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలు.. ఇలా పలు కీలక అంశాలపై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరగనుంది. విచారణ అనంతరం ధర్మాసనం ఇచ్చే ఆదేశాలపై ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి: పోలీసుల అదుపులో అంకిత పేరెంట్స్‌.. సెన్సేషన్‌ కేసులో హైడ్రామా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement