రైల్వే స్టేషన్లలో ఏదైనా కొనుక్కుంటున్నారా? ఇలా కాలర్‌ పట్టుకుంటారు జాగ్రత్త! | Samosa vendor drags customer by collar after UPI payment fails | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్లలో ఏదైనా కొనుక్కుంటున్నారా? ఇలా కాలర్‌ పట్టుకుంటారు జాగ్రత్త!

Oct 19 2025 8:29 PM | Updated on Oct 19 2025 8:45 PM

Samosa vendor drags customer by collar after UPI payment fails

భోపాల్‌: అది ఓ ప్రాంత రైల్వేస్టేషన్‌. ఓ పక్క ట్రైన్‌ కదులుతుంటే.. పక్కనే ఓ యువకుడి కాలర్‌ పట్టుకుని సమోసా వ్యాపారి బెదిరిస్తున్నాడు. ‘నా ట్రైన్‌ కదులుతోంది..నన్ను వదిలి పెట్టండి నమహాప్రభో అని బ్రతిమాలడుతున్న పట్టించుకోలేదు. పైగా ట్రైన్‌ పోతే పోనీ.. నన్నేం చేయమంటావు. నా డబ్బులు ఇస్తావా.. చస్తావా.. నా టైం వేస్టు చేశావు అంటూ సదరు సమోసా వ్యాపారి ప్రయాణికుడిని బెదిరించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో సమోసా వ్యాపారికి, రైల్వే ప్రయాణికుడికి మధ్య జరిగిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్న ఓ ట్రైన్‌ జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఆగింది. అప్పటికే ఆకలితో ఉన్న ఓ ప్రయాణికుడు ఫ్లాట్‌ఫారమ్‌ మీద ఏదైనా దొరుకుతుందేమోనని పరిసరాల్ని నిశితంగా గమనించాడు. అటు పక్కనే సమోసాలు అమ్మే స్టాల్‌ అతని కంట్లో పడింది. వెంటనే ట్రైన్‌ దిగి సమోసాలు తీసుకుని.. ఓ సంస్థ యూపీఐ యాప్‌ నుంచి పేమెంట్‌ చేసే ప్రయత్నం చేశాడు. నెట్‌వర్క్‌ సమస్య వల్ల చెల్లింపులు జరగలేదు. వెంటనే తీసుకున్న సమోసాలు తిరిగి వ్యాపారికి ఇచ్చి బయల్దేరాడు ఆ యువకుడు. 

అంతే ఠాట్‌.. నా టైం వేస్ట్‌ చేశావు. సమోసాలు తీసుకుని డబ్బులు ఇచ్చి ముందుకు కదులు అంటూ ప్రయాణికుడికి సమోసా వ్యాపారి హుకుం జారీ చేశాడు. అంతలోనే ట్రైన్‌ మెల్లగా కదలడం మొదలైంది. క్షమించండి. సమోసాలు వద్దు. నా దగ్గర ‍లిక్విడ్‌ క్యాష్‌ లేవుంటూ అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశాడు. అంతే ఒక్క ఉదుటున.. అవన్నీ చెప్పకు.. డబ్బులు ఇచ్చి సమోసాలు తీసుకో అంటూ ప్రయాణికుడిని కాలర్‌ పట్టుకున్నాడు. కాలర్‌ విడిపించుకుని ముందుకు వెళుతుంటే అడ్డు తగిలాడు. 

అతని చేతికి ఉన్న చేతిగడియారం (wristwatch) బలవంతంగా తీసుకున్నాడు. నాలుగైదు సమోసాలు ప్రయాణికుడు చేతిలో పెట్టాడు. ట్రైన్‌ మరింత వేగంతో ముందుకు కదులుతుంటే పాపం ఏం చేయాలో పాలపోని యువ ప్రయాణికుడు సమోసాలు తీసుకుని ట్రైన్‌ ఎక్కి వెళ్లిపోయాడు. ఈ ఉదంతాన్ని ఎదురుగా ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.    

ఈ వీడియో వైరల్‌ కావడంతో జబల్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) స్పందించారు. ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించిన సమోసా వ్యాపారిపై చర్యలకు ఉపక్రమించాం. రైల్వే పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు’అని పేర్కొన్నారు.  భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా  కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. 

మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సమోసా వ్యాపారి ప్రవర్తనను తప్పుపడుతుండగా, మరికొందరు యూపీఐ చెల్లింపులపై ఆధారపడటం ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు.  యూపీఐ వ్యవస్థలో సాంకేతిక లోపాలు,నెట్‌వర్క్ సమస్యలు వల్ల చెల్లింపులు నిలిచిపోవడం సాధారణమే అయినా, విక్రేతలు దీనిపై ఎలా స్పందించాలి అనే అంశంపై స్పష్టత అవసరం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement