
పకోడీ, చాయ్ బిస్కట్ వంటి అన్ని చిరుతిళ్లపైనా
సిగరెట్ ప్యాకెట్లపై తరహాలో ముద్రణ: కేంద్రం
ప్రయోగాత్మకంగా నాగపూర్ ఎయిమ్స్‌లో శ్రీకారం
నూనెలు, కొవ్వు, చక్కెర శాతం తెలిసేలా పోస్టర్లు
న్యూఢిల్లీ: సిగరెట్ ప్యాకెట్‌పై ‘ఆరోగ్యానికి హానికరం’ అంటూ విధిగా కనిపించే హెచ్చరిక ఇకపై అన్నిరకాల చిరుతిళ్లపైనా దర్శనమివ్వనుంది. జిలేబీ, సమోసా, పకోడీ, వడా పావ్ మొదలుకుని చాయ్ బిస్కట్ దాకా దాదాపుగా అన్నిరకాల చిరుతిళ్ల ప్యాకెట్లపైనా వాటిలోని నూనెలు, చక్కెర, కొవ్వు తదితరాల శాతాన్ని ప్రముఖంగా ముద్రించనున్నారు.
జీవనశైలికి సంబంధించిన పలు రకాల వ్యాధులకు హెచ్చు మోతాదులో నూనెలు, చక్కెర తదితరాలే కారణంగా మారుతున్న నేపథ్యంలో అనారోగ్యకర ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహనను పెంచడమే ఈ చర్య ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది.
దేశంలోనే తొలిసారిగా దీన్ని నాగపూర్ ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టనున్నారు. ఇందులో భాగంగా క్యాంపస్‌లోని కేఫ్టేరియాలు, ఫుడ్ కౌంటర్లు తదితర పక్కనే అందురూ తేలిగ్గా చదవడానికి వీలయ్యేలా పెద్ద అక్షరాలతో కూడిన భారీ పోస్టర్లు, హెచ్చరిక బోర్డులు పెడతారు. వాటిని తరచూ తింటే తలెత్తే ఆరోగ్య సమస్యలను వివరంగా ఏకరువు పెడతారు. అనంతరం దీన్ని కొద్ది నెలల్లో దేశమంతటికీ విస్తరిస్తారు.
నిషేధం కాదన్న కేంద్ర ప్రభుత్వం
చిరుతిళ్లలో ఇమిడి ఉండే ఆరోగ్యసమస్యల గురించి అధికారిక లెటర్‌హెడ్లు, కవర్లు, నోట్‌ప్యాడ్లు, ఇతర ప్రచురణల్లో ఆరోగ్య సందేశాలను విధిగా ప్రచురించాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆ శాఖ కార్యదర్శి పుణ్యసలిల శ్రీవాత్సవ జూన్ 21న ఈ మేరకు వాటికి లేఖలు రాశారు. సమోసా, వడా పావ్ తదిత సంప్రదాయ చిరుతిళ్లతో పాటు పిజ్జాలు, బర్గర్లు, డోనట్లను వంటి విదేశీ స్నాక్స్‌ను ఈ జాబితాలో చేర్చాలని సబార్డినేట్ లెజిస్లేషన్‌పై పార్లమెంటరీ కమిటీ చైర్మన్, శివసేన ఎంపీ మిలింద్ దేవ్‌రా సూచించారు. అయితే ఈ చర్య సమోసా, జిలేబీ, పకోడీ వంటి పాపులర్ చిరుతిళ్లపై నిషేధం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ‘‘కేవలం వాటని తినడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం, తద్వారా జీవన శైలి వ్యాధుల ముప్పును కనీస స్థాయికి తగ్గించడమే మా లక్ష్యం’’ అని వివరించింది.
పెను సమస్యగా... భారత్‌లో ఆరోగ్య సంక్షోభం నానాటికీ పెరుగుతూ వస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణాల్లో అతిగా వేయించిన, చక్కెర తదితరాల శాతం ఎక్కువగా ఉండే స్నాక్స్ వాడకం ఒకటని గుర్తించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 కల్లా భారత్‌లో ఏకంగా 44 కోట్ల మంది స్థూలకాయులుగా మారడం ఖాయమని ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ ఇటీవల ప్రచురించిన అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. ‘‘దేశవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దల్లో కూడా స్థూలకాయ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే ఎక్కువగా అధిక బరువుతో బాధ పడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–5) ఎత్తిచూపింది.
హెచ్చరికలు వేటిపై?
సమోసా, జిలేబీ, పకోడీ, వడా పావ్, కచోరీ, పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, గులా బ్ జామూన్, చాక్లెట్ పేస్ట్రీ లు, అన్నిరకాల శీతల పానీయాలు తదితరాలు