మోదీ పాత వీడియోతో కాషాయ నేతల హడావుడి | PM Modi Old Video Goes Viral Amid Rahul Gandhi SIR Protests And India Political Tensions, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

మోదీ పాత వీడియోతో కాషాయ నేతల హడావుడి

Oct 16 2026 9:29 AM | Updated on Oct 16 2026 9:36 AM

Old Modi Clip Resurfaces Amid India Political Tensions

రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ.. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు వరుసగా ఆ వీడియోను పోస్టు చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ బహిరంగ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఇప్పుడు ఎందుకు వైరల్‌ చేస్తున్నారనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. 

ప్రస్తుతం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అటు సీజేపీ, ఇతర విద్యా సంఘాలు కూడా ఈ పోరాటం విడిగా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీకి రాజకీయంగా మంచి పేరు వస్తోందనే ఉద్దేశంతోనే బీజేపీ నేతలు పాత వీడియోను తెరపైకి తెచ్చారంటూ సెటైర్లు పడుతున్నాయి. ప్రధాని మోదీ నిరాశ, అసహనంతో ఉన్నారనే అర్థం వచ్చేలా సీజేపీ కూడా ఈ వీడియోపై స్పందించింది.

మోదీ ఏమన్నారంటే..
ఈ ఏడాది ఫిబ్రవరిలో మీరట్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని పదవిని ఆశించేవారు ముందుగా ప్రజల హృదయాలను గెలుచుకోవాలని అన్నారు. పార్లమెంటులో ప్రధాని సీటును ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో మహిళా ఎంపీలను ముందుకు నెట్టడం ద్వారా ఆ స్థానాన్ని సాధించలేరని వ్యాఖ్యానించారు. మహిళా ఎంపీలను అలా ముందుకు పంపే స్థాయికి కాంగ్రెస్‌ దిగజారిందా? అంటూ ప్రశ్నించారు.

ఢిల్లీలో జరిగిన ఏఐ సమిట్‌ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు అర్ధనగ్నంగా నిరసన చేపట్టిన ఘటననూ మోదీ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ తన రాజకీయాలకు అంతర్జాతీయ వేదికను ఉపయోగించుకుందని, విదేశీ అతిథులు ఉన్న చోట గందరగోళం సృష్టించిందని విమర్శించారు. ఆ పార్టీ సైద్ధాంతికంగా దివాలా తీసిందని మండిపడ్డారు.

‘‘కాంగ్రెస్‌ నగ్నత్వం దేశానికి తెలుసు. ఇప్పటికే ప్రజల దృష్టిలో ఆ పార్టీ నేతలు దిగజారిపోయారు. దేశాన్ని అప్రతిష్ఠపాలు చేసే పనిలో కాంగ్రెస్‌ తీరిక లేకుండా ఉంది. రాజకీయ విభేదాల కంటే వ్యక్తిగత శత్రుత్వానికే ప్రాధాన్యమిస్తోంది. గతంలో నన్ను, నా తల్లిని అవమానించారు. ఇప్పుడు ప్రపంచ నేతల ఎదుట దేశాన్ని అవమానించారు. అన్ని పరిమితులనూ దాటిపోయారు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

తమ చర్యలకు సిగ్గుపడాల్సింది పోయి, వాటినే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కష్టపడుతుంటే, కొన్ని పార్టీలు విజయాలను జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. ఇలాంటి అంశాలపై తాను స్పందించినప్పుడు ‘విపక్షాలపై విరుచుకుపడ్డ మోదీ’ అంటూ వార్తలు రాయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.

కుర్చీ కోల్పోతామనే భయమా?
బీజేపీ నేతలు వరుసగా పోస్టు చేస్తున్న ఈ వీడియోపై సీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘ఇది ప్రధాని నిరాశ, అసహనాన్ని చూపిస్తోంది. కుర్చీ కోల్పోతామనే భయం ఇది’’ అని వ్యాఖ్యానించింది. మరోవైపు, పాత వీడియోను ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వెనుక కారణమేంటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, బీజేపీ నేతలు ఈ వీడియోను ఇప్పుడు ఎందుకు పోస్టు చేస్తున్నారనే దానిపై స్పష్టమైన కారణం వెల్లడికాలేదు.

పాత వీడియోతో కొత్త రాజకీయ రచ్చ
మోదీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో ఇప్పుడు బీజేపీ నేతల పోస్టులతో మళ్లీ చర్చలోకి వచ్చింది. అయితే, ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాల అంశాలపై కొనసాగుతున్న రాజకీయ పోరాటానికి ఈ వీడియోను జోడించి ఇరు పక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. పాత వీడియోను ఇప్పుడు ఎందుకు ప్రచారం చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం కంటే, దాని చుట్టూ సాగుతున్న రాజకీయ వాదోపవాదాలే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌, ఎస్పీకి యూపీలో షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement