
నైరోబి: కెన్యాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యే వారిని తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడి, 25 మంది మృతి చెందారు. నైరుతి కెన్యాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడి గుంతలోకి ఒరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
ఈ బస్సు కాకామెగా పట్టణం నుండి కిసుము నగరానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. న్యాంజా ప్రావిన్స్ ప్రాంతీయ ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి పీటర్ మైనా తెలిపిన వివరాల ప్రకారం బస్సు అధిక వేగంతో వెళుతోందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఈ దుర్ఘటనలో 25 మంది మృతిచెందారని కెన్యాలో వైద్య సేవల ప్రధాన కార్యదర్శి ఫ్రెడ్రిక్ ఓమా ఒలుగా తెలిపారు.
ఈ ప్రమాదం ఈ ప్రాంతంలోని వారిని ఆందోళనకు గురిచేసింది. కాగా కెన్యా, తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇక్కడి రోడ్లు ఇరుకుగా, అనేక గుంతలతో ఉండటంతోనే ప్రమాదాలు జరుగుతుంటాయి. వాహనాల అతివేగం కూడా ప్రమాదాలకు కారణంగా నిలుస్తోంది దీనికి ముందు నకురు కౌంటీలోని నైవాషాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఈ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఆ సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు.