
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్
న్యూఢిల్లీ: దేశంలో అన్నింటి కంటే అత్యున్నతం పార్లమెంట్ లేదా న్యాయ వ్యవస్థ కాదని.. రాజ్యాంగమే అత్యున్నతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తేల్చిచెప్పారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఇతర పదవులు చేపట్టాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు. జస్టిస్ గవాయ్ ఈ నెల 14న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
తొలి బౌద్ధ మతస్తుడైన సీజేఐగా ఆయన రికార్డుకెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ గవాయ్ ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడి గురించి తెలిసి తాము దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. ఈ దాడిలో మృతిచెందిన వారికి సుప్రీంకోర్టు తరఫున నివాళులర్పించామమని, ముష్కరుల దుశ్చర్యను ఖండించామని అన్నారు. దేశం మొత్తం ఆందోళన, సంక్షోభంలో ఉన్న సమయంలో తాము మౌనంగా ఉండలేమని పేర్కొ న్నారు.
దేశంలో తాము కూడా భాగమేనని వ్యాఖ్యానించారు. ఎవరు అత్యున్నతం అనేదానిపై రాజకీయ నేతలు లేవనెత్తుతున్న ప్రశ్నలపై జసిŠట్‌స్ గవాయ్ స్పందించారు. రాజ్యాంగమే అత్యున్నతం అని కేశవానంద భారతి కేసులో 13 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. తనకు ఎలాంటి రాజకీయ ఆకాంక్షలు లేవని, రిటైర్‌మెంట్ తర్వాత గవర్నర్ వంటి పదవులు తీసుకోనని స్పష్టంచేశారు.
న్యాయమూర్తులు రాజకీయ నాయకులను, ఇతర రంగాల ప్రముఖులను కలిసి మాట్లాడ డంలో తప్పేమీ లేదని అభిప్రాయపడ్డారు. ఇతరులను కలవకపోతే ప్రజల సమస్యలు, కొత్త విషయాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. భారత్–పాకిస్తాన్ మధ్య దాడులు ఆగిపోవడం మంచి పరిణామం అని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాలకు నష్టమే తప్ప ప్రయోజనం చేకూరలేదని అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టులో 33 మంది న్యాయమూర్తులు ఉండగా, వీరిలో ఇప్పటిదాకా 21 మంది తమ ఆస్తుల వివరాలు ప్రకటించారని జస్టిస్ గవాయ్ తెలిపారు. మిగిలినవారు కూడా త్వరలో ఆస్తుల వివరాలు వెల్లడిస్తారని స్పష్టంచేశారు. ఆస్తుల సమాచారం బహిర్గతం చేసే సంప్రదాయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు కూడా పాటిస్తే బాగుంటుందని సూచించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తులను నియమించే విషయంలో కొలీజియం చేసిన కొన్ని సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలకపోవడంపై మాట్లాడేందుకు జస్టిస్ గవాయ్ నిరాకరించారు. న్యాయ వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యం తగినంతగా ఎందుకు లేదని ప్రశ్నించగా... రాజ్యాంగబద్ధమైన పదవుల్లో నియామకాలకు రిజర్వేషన్లు లేవని బదులిచ్చారు.