
సరికొత్త ఫీచర్లను పరిచయం చేసిన గూగుల్
న్యూడ్ కంటెంట్ వస్తే చాలు, ‘బ్లర్’ చేసేస్తుంది
మీ జెమినీ చాటింగ్‌ని ఎవ్వరూ చూడలేరు
టూర్ బెస్ట్ డీల్స్ కోసం వినూత్న ఏఐ టూల్
అప్పుడూ.. ఇప్పుడూ.. మనమంతా నెట్టింట్లో ముందు తట్టే తలుపు గూగుల్‌దే. అంతలా అన్నింట్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరికొన్ని ఫీచర్లను పరిచయం చేసింది.
ఆ మెసేజెస్ ‘బ్లర్’!
వాట్సాప్‌లో లేని సేఫ్టీ ఫీచర్ గూగుల్ మెసేజుల్లో ఒకటుంది. తరచూ వాట్సాప్ లేదా మరేదైనా మెసేజింగ్ యాప్‌లలో తెలియని నంబర్ నుంచి మెసేజులు, ఫొటోలు, వీడియోలు వస్తుంటాయ్. వాటిలో అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉండొచ్చు. అనుకోకుండా వాటిని ఓపెన్ చేసి షాక్ అవుతాం. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే.. పరువు పోయినట్టే! అలాంటి ఇబ్బందులు రాకుండా.. అద్భుతమైన ఫీచర్‌ను ‘గూగుల్ మెసేజెస్’ తీసుకొచ్చింది. అదే ఆటోమేటిక్ ‘బ్లర్’ ఫీచర్. ఇది ‘న్యూడ్’ మెసేజ్‌లను ఓపెన్ చేస్తే ఆటోమేటిగ్గా బ్లర్ చేస్తుంది. సెండర్‌ని కూడా వెంటనే బ్లాక్ చేస్తుంది.
కావాలంటే.. అశ్లీల చిత్రాలు కనిపించకుండా చేసి, సంభాషణ కొనసాగించొచ్చు. అంతేకాదు.. మీరు పొరపాటున అశ్లీలమైన కంటెంట్‌ను పంపితే అలర్ట్ చేస్తుంది. ఇంట్లో పిల్లలు కూడా ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. మైనర్లు వాడే ఫోన్లలో ఇది ఆన్ చేసి ఉంటుంది. అయితే, వాళ్లు దాన్ని ఆఫ్ చేసేందుకు వీలుంది. అందుకే పేరెంటల్ కంట్రోల్స్ పెట్టాలి. అప్పుడు తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా దాన్ని ఆఫ్ చేయడం కుదరదు. అందుకు ఫ్యామిలీ లింక్ యాప్ ని వాడొచ్చు. దీన్ని మీ ఫోన్లో ఎనేబుల్ చేసేందుకు గూగుల్ మెసేజెస్ యాప్ ని ఓపెన్ చేయండి. ఈ పాత్ ని ఫాలో అవ్వండి.
Messages Settings > Protection & Safety > Manage sensitive content warnings > Warnings in Google Messages.
‘జెమినై’లో ప్రైవసీ అప్‌డేట్
ఏఐ పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో చాట్‌జీపీటీ కంటే ముందే గూగుల్ జెమినై.. ఇన్ కాగ్నిటో మోడ్ పరిచయం చేసింది. ఏఐ యూజర్ల ప్రైవసీకి ఇదో చక్కని పరిష్కారం. ఇకపై జెమినితో చేసే చాటింగ్, వ్యక్తిగత సమాచారం ఎవరి కంటా పడవు. ఎందుకంటే.. గూగుల్ కొత్త ’టెంపరరీ చాట్స్’ ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఇది మనం బ్రౌజింగ్‌లో వాడే ఇ¯Œ కాగ్నిటో మోడ్‌లా పని చేస్తుంది. దీన్ని వాడుకుని జెమినితో మనం చేసే సంభాషణలు సేవ్ కాకుండా చూడొచ్చు. మీ కమాండ్ ప్రాంప్ట్స్‌ని ఇకపై ఎవరూ కాపీ కొట్టలేరు.
ఏఐ వాడకంలో ప్రైవసీని కోరుకునే వారికి ఇదో చక్కని ఫీచర్. ఇంకా చెప్పాలంటే.. ‘గూగుల్ కీప్’ సర్వీసులో ఫొటోలు,వీడియోలను జెమిని మీ అనుమతితోనే యాక్సెస్ చేసేలా చేయొచ్చు. ఒకవేళ ‘కీప్’ డేటా యాక్సెస్ ఇవ్వాలంటే ఎప్పుడైనా ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే, జెమినై లైవ్ సర్వీసులోనూ ప్రైవసీని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ఈ సర్వీసుని వాడే క్రమంలో మీ ప్రమేయం లేకుండా చూపించే ఆడియో, వీడియో సేకరించకుండా చేయొచ్చు.