సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
మక్తల్: వచ్చే నెల 1న మక్తల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసులు అధికారులకు సూచించారు. గురువారం ఏఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ లింగయ్యలతో కలిసి ఆయన సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా చర్యలపై పోలీసు అధికారులతో చర్చించారు. సీఎం సభా స్థలం, హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్ ప్రాంతాలతో పాటు ప్రజలు రాకపోకలు సాగించే మార్గాలను పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన ముగిసే వరకు ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు.


