ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
నారాయణపేట: రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ప్రచారంపై ఎస్పీ డాక్టర్ వినీత్, అదనపు రెవెన్యూ కలెక్టర్ శ్రీనుతో కలిసి తహసీల్దార్లు, ఎస్‌ఎస్‌టీ, ఎస్‌ఎఫ్‌టీ బృందం అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి తహసీల్దార్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించి, నిందితులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని చెక్‌పోస్టుల్లో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా జరగాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందుస్తు అనుమతి తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, డీపీఓ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లోమీడియా సెంటర్ ప్రారంభం
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌ను కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి ఎస్పీ డాక్టర్ వినీత్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశామని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై మీడియా సెంటర్ ద్వారా నిఘా పెట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, డీపీఆర్‌ఓ రషీద్, బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్‌ఖలీల్, డీఏఓ జాన్‌సుధాకర్, డీపీఆర్‌ఓ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.


