మెట్ల పైనుంచి జారిపడి వ్యక్తి మృతి
కొల్లాపూర్: పట్టణంలోని తెలుగువీధికి చెందిన జలకం నర్సింహ (46) ప్రమాదవశాత్తు మెట్ల పైనుంచి జారిపడి మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. ఆదివారం పాలీష్ బండలు పర్చేందుకు నర్సింహ ఓ భవనం వద్దకు వెళ్లాడు. అక్కడ బండలు మెట్లమీది నుంచి కిందికి తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. వెంటనే తోటి కార్మికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నర్సింహకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఉరేసుకొని
ఆత్మహత్యాయత్నం
నాగర్‌కర్నూల్ క్రైం: ఓ వ్యక్తి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. జిల్లా కేంద్రంలోని వివేకానందనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ రాజకీయపార్టీకి చెందిన కార్యకర్త నర్సింహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పురుగు మందు తాగి ఆత్మహత్య
కొడేరు: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొడేరు మండలం ఎత్తం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ జగదీశ్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వడ్డెర విష్ణు (45) భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నెల 14న భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలో స్వగ్రామానికి వచ్చి కలుపు మందు తాగి స్నేహితుడు రామ్‌కు ఫోన్ చేశాడు. అతను కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే కొల్లాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పాలమూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుని తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీ..
లారీ డ్రైవర్ మృతి
మహబూబ్‌నగర్ క్రైం: రోడ్డు దాటుతున్న లారీ డ్రైవర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా కండికి చెందిన శ్రీనివాసులు (46) ఆదివారం లారీలో ఇనుపలోడ్ వేసుకొని హైదరాబాద్ నుంచి కర్ణాటకు బయలుదేరాడు. మన్యంకొండ స్టేజీ దగ్గర లారీని ఆపి అద్దాలు శుభ్రం చేసి రోడ్డు దాటుతుండగా రాయచూర్ నుంచి మహబూబ్‌నగర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీనివాసులు అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య బాలమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.
జాతీయ రహదారి
దిగ్బంధంపై కేసు నమోదు
మాగనూర్: పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించి పబ్లిక్ న్యూసెన్స్, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్‌బాబు ఆదివారం తెలిపారు. ఈ నెల 17న మిల్లర్ల సమ్మె కారణంగా మండల పరిధిలోని వడ్వాట్ గేట్ దగ్గర రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రైతులు మిల్లుకు తీసుకొచ్చిన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని చేపట్టిన రైతు ధర్నాకు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకుడు రాఘవరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు బసంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, అశోక్‌రెడ్డి, బీజేపీ ఉమ్మడి మండల అధ్యక్షుడు నల్లె నర్సప్పతో పాటు మరికొందరు జాతీయ రహదారిపై సుమారు నాలుగు గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించిన నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
చికిత్స పొందుతున్న కార్మికుడు మృతి
● మూడుకు చేరిన
మృతుల సంఖ్య
జడ్చర్ల: మండలంలోని గొల్లపల్లి సమీపంలో ఉన్న సాలసార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మూడురోజుల కిందట జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దేవరాజ్ (20) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. మిల్లులో అగ్ని ప్రమాదం జరిగిన రోజే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విషయం పాఠకులకు విధితమే. క్షతగాత్రులు దేవరాజ్, సంబుశెట్టిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా.. దేవరాజ్ మృతి చెందినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


