వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ బలి
● మహబూబ్‌నగర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట
కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆందోళన
● మృతి చెందిన విషయం ఆలస్యంగా చెప్పారంటూ ఆరోపణ
పాలమూరు: వైద్యుల నిర్లక్ష్యమే మహిళ మృతికి కారణమంటూ నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు.. మండల పరిధిలోని కోడూర్ గ్రామానికి చెందిన లలిత(35) అనారోగ్య సమస్యలతో మూడు రోజుల కిందట మేనక థియేటర్ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. చికిత్స అందిస్తుండగా ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లు సమాచారం. వైద్యం చేస్తున్నామని చెప్పి డబ్బులు తీసుకున్నారని, పరిస్థితి విషమిస్తే కనీసం సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరణించిన విషయం కూడా ఆలస్యంగా చెప్పారని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది. విషయం తెలసుకున్న వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీసులు పరిస్థితి అదుపు దాటకుండా మృతురాలి భర్త నాగరాజు, కుటుంబ సభ్యులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు సంతానం ఉన్నారు.
వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ బలి


