సర్పంచు రిజర్వేషన్లు ఖరారు!
నారాయణపేట: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్పంచు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కొన్ని రోజులుగా సర్పంచు రిజర్వేషన్ల కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం మేరకు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సర్పంచు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లకు విధివిధానాలను ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీఓ 46 విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇచ్చిన జీఓకు అనుగుణంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశా నిర్దేశంతో ఆర్డీఓ రాంచందర్‌నాయక్, డీపీఓ సుధాకర్‌రెడ్డి, డీఆర్డీఓ మొగులప్పలు శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు చేయగా.. మండలాల్లో ఎంపీడీఓలు వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
లాటరీ పద్ధతిలో..
సర్పంచ్ రిజర్వేషన్లకు 2011 జనగణన, ఎస్‌ఈ ఈసీపీ డేటా వినియోగిస్తూ.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అధికారులు ఖారారు చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో రిజర్వు చేసిన వార్డులు/గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వందకు వందశాతం ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు రిజర్వు చేశారు. మొదట ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేసి.. ఆ తర్వాత ఎస్సీ, బీసీలకు కేటాయింపులు చేశారు.
272 జీపీలు.. 2466 వార్డులు
జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో 272 జీపీలు, 2,466 వార్డులకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేసి.. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వెల్లడించారు. మొత్తం 3,96,541 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,94,124 మంది పురుషులు, 2,02,410 మంది మహిళలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం 2,470 పోలింగ్‌స్టేషన్లను అధికారులు గుర్తించారు. మొత్తం 272 జీపీలకు గాను జనరల్‌కు 68 స్థానా లు, జనరల్ మహిళకు 56, ఎస్సీ జనరల్‌కు 26, ఎస్సీ మహిళలకు 17 స్థానాలు, ఎస్టీ జనరల్‌కు 20, ఎస్టీ మహిళలకు 13 స్థానాలు, బీసీ జనరల్‌కు 38, బీసీ మహిళలకు 34 స్థానాలు కేటాయించారు.
జీఓ 46కు అనుగుణంగా
రిజర్వేషన్ల అమలు
రొటేషన్ పద్ధతిలో
మహిళలకు కేటాయింపులు
అధికారికంగా వెల్లడించని అధికారులు
సర్పంచు రిజర్వేషన్లు ఖరారు!
సర్పంచు రిజర్వేషన్లు ఖరారు!


