క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
నారాయణపేట రూరల్: చదువుతో పాటు క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో శనివారం ఎస్‌జీఎఫ్ జిల్లాస్థాయి అండర్–14 బాలబాలికలకు వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వాలీబాల్ వంటి క్రీడా పోటీలు క్రీడాకారుల్లో ఒప్పందం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంచుతాయన్నారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభకనబర్చే వారు ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సూచించారు. కాగా, జిల్లాలోని 13 మండలాల నుంచి దాదాపు 260 మంది క్రీడాకారులు జిల్లాస్థాయి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన పోటీల ముగింపు కార్యక్రమానికి డీఈఓ గోవిందరాజులు హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. జిల్లాస్థాయిలో ప్రతిభకనబరిచిన క్రీడాకారులు ఈ నెల 24న గద్వాలలో జరిగే ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సదాశివారెడ్డి, వైస్‌చైర్మన్ హన్మంతు, ఆర్టీఓ సభ్యుడు రాజేశ్, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, పీడీలు నర్సింహులు, రత్నయ్య, వెంకటప్ప, అనంతసేన, సాయినాథ్, రామకృష్ణ, నర్సింహారెడ్డి, శ్రీధర్, వేణు, పారిజాత, రాజేశ్వరి, అక్తర్, బసంతరెడ్డి పాల్గొన్నారు.
ఆహారంలోనాణ్యత లోపించొద్దు
మక్తల్: విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించొద్దని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రషీద్ అన్నారు. మక్తల్ పట్టణంలోని మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలో శనివారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. స్టోర్‌రూంలో ఉన్న కూరగాయలు, బియ్యం, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆయన వెంట పాఠశాల ప్రిన్సిపాల్ ఉన్నారు.
ప్రైవేటీకరణ అభివృద్ధికి ప్రమాదకరం
నారాయణపేట రూరల్: విద్య, వైద్యం వంటి కీలక రంగాలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద, మధ్యతరగతి వారి భవిష్యత్‌కు ప్రమాదకరమని ఇల్లేందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) జిల్లా 3వ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా గుమ్మడి నరసయ్యతో పాటు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వి, మాజీ అధ్యక్షుడు హన్మేష్ మాట్లాడారు. విద్యార్థులు తమ హక్కుల కోసం మాత్రమే కాక, రైతుల గిట్టుబాటు ధరలు, లింగ అసమానతలు, కుల,మత వివక్ష వంటి సమస్యలపై కూడా పోరాడాలని సూచించారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా పిల్లలకు మెరుగైన ఉచిత విద్య అందకపోవడం పాలకుల వైఫల్యమని విమర్శించారు. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడినప్పటికీ, అభివృద్ధిపై ఏ ప్రభుత్వానికీ నిజమైన ఆసక్తి లేదన్నారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థ పేదలను విద్యకు దూరం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు నిలిచిపోవడం, మెస్ చార్జీల పెంపుపై స్పందించకపోవడం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయకపోవడం వంటి అంశాలు విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి తెచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పాఠ్యాంశాల్లో అశాసీ్త్రయ అంశాలు చొప్పించడం దేశ భవిష్యత్‌కు ప్రమాదమని పేర్కొన్నారు. అంతకుముందు మహాసభల సందర్భంగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్, డాక్టర్ నాగేష్, న్యాయవాది కాళేశ్వర్, రాము, రామకృష్ణ, సలీమ్, కాశీనాథ్, అజయ్, సంధ్య, వెంకటేష్, గౌస్, మహేష్ పాల్గొన్నారు.
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్


