1న మక్తల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
● మక్తల్–కొడంగల్–పేట ఎత్తిపోతల పనులకు శ్రీకారం
● రూ. 200కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి భూమిపూజ
● ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్, ఎస్పీ
మక్తల్: నియోజకవర్గంలో డిసెంబర్ 1న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డా.వినీత్‌తో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మండలంలోని కాట్రేవ్‌పల్లిలో మక్తల్–కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించడంతో పాటు గొల్లపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. అదే విధంగా మక్తల్–నారాయణపేట బీటీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేస్తారని అన్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని తెలిపారు. సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశమై సీఎం పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటనలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రొటోకాల్ తప్పొద్దని సూచించారు. గొల్లపల్లి వద్ద సీఎం బహిరంగ సభకు వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రజల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు సీఎం పర్యటన షెడ్యూల్‌ను పక్కాగా రూపొందించాలని సూచించారు. అధికారలు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మహిళా సంక్షేమానికి పెద్దపీట..
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆయన కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి మహిళలకు ఇందిరా మహిళాశక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగా మహిళా సంఘాలతో స్కూల్ యూనిఫాం తయారీతో పాటు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణ, ఆర్టీసీకి బస్సులను అద్దెకు ఇచ్చేందుకు రాయితీపై రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని సూచించారు. గత ప్రభుత్వం తూకం వేసిన నాసీకరకం చీరలను పంపిణీ చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యతమైన నేత చీరలను పంపిణీ చేస్తుందన్నారు. పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రైతులకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. మక్తల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన లక్ష్యమన్నారు. ఇప్పటికే రహదారుల అభివృద్ధికి రూ. 70కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మక్తల్‌కు డిగ్రీ కాలేజీ, 150 పడకల ఆస్పత్రి, రూ. 200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెట్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను, ఆర్డీఓ రామచందర్, ఎస్‌డీసీ రాజేందర్, డీఎస్పీ లింగయ్య, డీఆర్డీఓ మొగులప్ప, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీధర్, ఆర్‌అండ్‌ఆర్ ఈఈ వెంకటరమణయ్య, పీఆర్ ఈఈ హీర్యానాయక్, డీవైఎస్‌ఓ వెంకటేశ్, డీపీఆర్‌ఓ రషీద్, డీఈఓ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
1న మక్తల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి


