ప్రశాంత్‌కుమార్‌రెడ్డికే మళ్లీ డీసీసీ పగ్గాలు
నారాయణపేట: జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మరోసారి కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డికే దక్కాయి. జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆరుగురు పోటీ పడ్డారు. అయితే పార్టీ పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డిల గెలుపునకు కృషిచేసిన ప్రశాంత్‌కుమార్‌రెడ్డికే పార్టీ అధిష్టానం మరోసారి అవకాశం కల్పించినట్ల రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో వాకిటి శ్రీహరి డీసీసీ అధ్యక్షుడిగా ఉండి మక్తల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన సమయంలో ప్రశాంత్‌కుమార్‌రెడ్డి సైతం ఎమ్మెల్యే టికెట్ కోసం చివరి క్షణం వరకు పోటీ పడ్డారు. కాగా, బీసీ సామాజికి వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే టికెట్ ఖరారు చేయించడంతో ఆశలు వదులుకున్నారు. ఆ సమయంలో అధిష్టానం మాట వినడంతో ఆయనకు వెంటనే డీసీసీ అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ విధేయుడిగా పనిచేస్తుండటంతో.. మరోసారి అవకాశం కల్పించేందుకు అధిష్టానం మొగ్గుచూపింది.
● ప్రశాంత్‌రెడ్డిది నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేర్ గ్రామం. ఆయన 1975 మే 8న జన్మించారు. మెకానికల్ ఇంజినీర్ పూర్తిచేశారు. ఆయన తండ్రి వీరారెడ్డి రెండు పర్యాయాలు కాంగ్రెస్ నుంచి అమరచింత ఎమ్మెల్యేగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా రెండు పర్యాయాలు పనిచేశారు. తండ్రి బాటలో తనయుడిగా 1992లో అమరచింత ఎన్‌ఎస్‌యుఐ నియోజకవర్గ ఇన్‌చార్జిగా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తనపై నమ్మకంతో మరోసారి డీసీసీ అధ్యక్షుడిగా నియమించిన ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


