‘ఉపాధి’కి సరికొత్త సంస్కరణలు
నర్వ: కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అనేక సంస్కరణలు చేపడుతోంది. ఇప్పటికే ఉపాధి పనులకు జియోఫెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టగా.. తాజాగా ‘యుక్తధార పోర్టల్’ను అమలులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా పైలెట్ ప్రాజెక్టుగా గతేడాది మండలానికి ఓ గ్రామం చొప్పున జిల్లావ్యాప్తంగా 13 గ్రామాలను ఎంపిక చేసి పనుల ప్రతిపాదనలను తయారు చేశారు. తాజాగా మిగిలిన గ్రామాలను ఈ పోర్టల్‌లోకి తీసుకొచ్చారు.
పక్కగా నమోదు
గతంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులను గుర్తించి ప్రతిపాదనలు తయారు చేసే వారు. తాజాగా వచ్చిన యుక్తధార పోర్టల్‌లో జియో స్పెషియల్ ప్లానింగ్ పోర్టల్ ద్వారా పనులు చేపట్టనున్నారు. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) భువన్ పోర్టల్ ఆధారంగా అధికారులు యాప్‌లో పనులు గుర్తించాల్సి ఉంటుంది. గ్రామాల్లో పనులు చేపట్టే ప్రాంతాలను యాప్‌లో ఆన్‌లైన్ ద్వారా లైవ్‌లో నమోదు చేస్తారు. ఇది వరకు ఈ ప్రాంతాల్లో పనులు చేపట్టారా.. పనులు చేపట్టడానికి ఆ ప్రాంతం అనుకూలంగా ఉందా అనే వివరాలు నిర్ధారించడంతో పాటు ఫొటోలను ప్రత్యక్షంగా చూపిస్తుంది. దీంతో పనులు చేపట్టే ప్రాంతాలను సులభంగా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం టెక్నికల్ అసిస్టెంట్లు గ్రామాల్లో ప్రాంతాలను గుర్తించే పనిలో నిమగ్నయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెక్నికల్ అసిస్టెంట్లు జిల్లాలో ఎలాంటి పనులు చేపట్టాలో గుర్తించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు ప్రతి గ్రామానికి ఓ లాగిన్ ఐడీని క్రియేట్ చేశారు. దాని ఆధారంగా పోర్టల్‌లో పనులు చేపట్టే ప్రాంతాలను నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియలో గ్రామ సభల ద్వారా పనులు గుర్తించారు.
యుక్తధార పోర్టల్ ద్వారా అమలు
గతేడాది పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మండలానికి ఒక్కో గ్రామం ఎంపిక
మిగిలిన గ్రామాల వివరాల నమోదుకు శ్రీకారం
‘ఉపాధి’కి సరికొత్త సంస్కరణలు


