రైస్‌మిల్లు వేబ్రిడ్జిలో అవకతవకలపై తనిఖీ
మాగనూర్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి మిల్లు వద్ద బాట్లు (తూనికపు రాళ్లు), ఒక టన్ను టెస్ట్ వెయిట్లు అందుబాటులో ఉంచుకోవాలని, స్టాంపింగ్ లేకుండా వేబ్రిడ్జి వినియోగించరాదని తూనికల కొలతల శాఖ అధికారి రవీందర్, సివిల్ సప్లై డీఎస్‌ఓ బాల్‌రాజు ఆదేశించారు. మండలంలోని వర్కూర్ సమీపంలో గల ఎంఎస్‌ఆర్ రైస్ మిల్లును వారు గురువారం పరిశీలించారు. సదరు రైస్ మిల్లులోని వేబ్రిడ్జిలో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ గతంలో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో బుధవారం స్థానిక ఇన్‌చార్జి తహసీల్దార్ సురేష్‌కుమార్ మిల్లును తనిఖీ చేశారు. మిల్లులో జరుగుతున్న అవకతవకలకు కారణాలు తెలుసుకోవడానికి మిల్లుకు ధాన్యం సప్‌లై నిలిపివేశారు. ఇందులో భాగంగా జిల్లా తూనికల శాఖ అధికారులతో పాటు సివిల్ సప్‌లై అధికారులు మిల్లును పరిశీలించారు. అయితే సదరు అధికారులు వచ్చినా మిల్లు యాజమాని అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉండాల్సిన బాట్లు (తూకపు రాళ్లు), ఒక టన్ను టెస్ట్ వెయిట్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. ఈ నెల 4న తనిఖీలకు వచ్చి కేసు నమోదు చేసిన సమయంలోనే అధికారులు తప్పకుండా బాట్లు, ఒక టన్ను టెస్ట్ వెయిట్లు ఉంచుకోవాలని చెప్పిన ఇంకా నిర్లక్ష్యంగా ఉండటంపై అధికారులు యజమాని తీరుపై మండిపడ్డారు. చివరికి గత్యంతరం లేక వారే తెచ్చుకున్న కారుతో వేబ్రిడ్జి టెస్టింగ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా తూనికల కొలతల శాఖ జిల్లా అధికారి రవీందర్ మాట్లాడుతూ.. మిల్లుల యాజమానులు ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని మండల రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లులో జరుగుతున్న అవకతవకలను గుర్తించి గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


