వయోవృద్ధులకుతోడ్పాటునందించాలి
నారాయణపేట: వయోవృద్ధులు తమ శేష జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు తోడ్పాటు అందించాలని ఆర్డీఓ రామచంద్రనాయక్ కోరారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు వృద్ధాప్యంలో తమకు ఏదో చేస్తారని ఆశించరని.. పిల్లలు గొప్పగా ఉండాలని, కీర్తి ప్రతిష్టలతో జీవించాలని కోరుకుంటారని తెలిపారు. కానీ ఈ మధ్యకాలంలో పత్రికల్లో డబ్బు కోసం తల్లిని చంపిన తనయుడు, ఆస్తి కోసం తండ్రిని కడతేర్చిన తనయుడు అనే వార్తలు వస్తుండటం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వయోవృద్ధులకు కొన్ని హక్కులు ఉన్నాయని.. వాటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పిల్లలకు ఇచ్చిన ఆస్తిని వయోవృద్ధులు తిరిగి పొందే అధికారం సిటిజన్ యాక్ట్‌లో ఉందని చెప్పారు. డిప్యూటీ కలెక్టర్ ఫణికుమార్ మాట్లాడుతూ.. వయోవృద్ధులు తమశక్తి మేరకు వ్యాయామం, నడక చేయాలని, జిల్లాకేంద్రంలో వారికోసం ప్రత్యేకంగా పార్కు కూడా ఉందని గుర్తుచేశారు. ఎలాంటి సమస్య ఉన్నా.. టోల్‌ఫ్రీ నంబర్ 14567 ఫోన్‌చేసి చెప్పాలని సూచించారు. సీనియర్ సిటిజన్ ఆత్మారాం ఏడికే, సుదర్శన్‌రెడ్డి సీనియర్ సిటిజన్ యాక్ట్ గుర్తించి వివరించారు. జిల్లాకేంద్రంలో వయోవృద్ధుల సంక్షేమ భవనాన్ని నిర్మించాలని ఆర్డీఓను కోరారు. అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. శైలజ, డీపీఆర్వో రషీద్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా. మల్లికార్జున్, డీడబ్ల్యూఓ ఉద్యోగి సాయి, డీసీపీఓ కరిష్మా, నర్సిములు, భారతి పాల్గొన్నారు.
23న ఉమ్మడి జిల్లావాలీబాల్ జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: రాజన్న సిరిసిల్లలోఈనెల 29 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ అంతర్‌జిల్లా వాలీబాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్ల ఎంపికలను 23వ తేదీన ఉదయం 8.30 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ హనీఫ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనేవారు కోచ్ పర్వేజ్‌పాషా–బాలురు (77805 82604), జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య–బాలికలు (94403 11067) సంప్రదించాలన్నారు.
రేపు సీనియర్ సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: ఆదిలాబాద్‌లో ఈనెల 28 నుంచి 30 వరకు జరగనున్న సీనియర్ పురుషుల రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టు ఎంపికను ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్‌స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు జి.రాఘవేందర్, బి.నాగరాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన క్రీడాకారులు ఆధార్‌కార్డు, ఇతర సర్టిఫికెట్లతో స్టేడియంలో రిపోర్టు చేయాలని కోరారు. వివరాల కోసం 99590 16610, 99592 20075 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


