మోడల్ సీహెచ్‌సీలుగా తీర్చిదిద్దుదాం
కోస్గి రూరల్/మద్దూరు: కోస్గి, మద్దూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. మంగళవారం కోస్గి, మద్దూరు సీహెచ్‌సీల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. కోస్గి ఆస్పత్రిలో చేపట్టిన పోస్టుమార్టం గది, ప్రహరీ, వేయిటింగ్ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఆస్పత్రిలో ఇంకా అవపరమైన సౌకర్యాల కోసం నివేదిక సమర్పించాలని సూపరింటెండెంట్ అనుదీప్‌కు సూచించారు. మద్దూరు ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వచ్చే వారంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రానున్న నేపథ్యంలో ఆస్పత్రిలో ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కరించాలని సూపరింటెండెంట్ మల్లికార్జున్, డా.పావనిలను ఆదేశించారు. ము ఖ్యంగా ఆస్పత్రి పరిసరాల శుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని పుర కమిషనర్ శ్రీకాంత్‌కు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట కోస్గి మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఏఈ జ్ఞానేశ్వర్ ఉన్నారు.


