తెల్లబోతున్నారు..!
సీసీఐ కొర్రీలు.. కొనుగోళ్ల బంద్‌తో చిక్కులు
నిలిచిన కొనుగోళ్లు..పలు చోట్ల ఆందోళనలు
జిన్నింగ్ వ్యాపారుల బంద్‌తో సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని సీసీఐ సెంటర్లలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. మరోవైపు జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి వాహనాలు భారీగా క్యూ కడుతుండడంతో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు.
● నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గేట్ వద్ద ఎన్‌హెచ్–167పై రైతులు ధర్నాకు దిగారు. దీంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ఆందోళనకు బీఆర్‌ఎస్ నాయకుడు, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితోపాటు పలువురు రాజకీయ నేతలు సంఘీభావం తెలిపారు.
● జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి శివారులోని సీసీఐ కేంద్రం వద్ద రైతులు మధ్యాహ్యం సమయంలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విజయుడు సాయంత్రం సెంటర్ వద్దకు చేరుకుని అధికారులతో కలిసి కొనుగోలు చేసేలా మిల్లు యజమానిని ఒప్పించారు. దీంతో రాత్రి వరకు ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగగా.. రైతులు అర్ధరాత్రి వరకు పడిగాపులు కాశారు.
‘ప్రైవేట్’లో నిలువు దోపిడీ..
ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో కొర్రీల నేపథ్యంలో రైతులు విధిలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారులు ధర భారీగా తగ్గించారు. సీసీఐ సెంటర్లలో ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.8,110 మద్దతుతో కొనుగోలు చేస్తుండగా.. ప్రైవేట్ వ్యాపారులు రూ.5,500 నుంచి రూ.7 వేల వరకు మాత్రమే పెడుతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. చేసేదేమీ లేక రైతులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు.
కొర్రీల మీద కొర్రీలు..
ఈ ఏడాది వానాకాలం పత్తి కొనుగోళ్లలో తొలి నుంచీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తున్న తీరు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ సీజన్‌లోనే అందుబాటులోకి తెచ్చిన కపాస్ యాప్ కష్టాలను తెచ్చింది. యాప్ లో రైతులు, పంట నమోదు చేసుకుంటేనే కొనుగోళ్లకు అవకాశం ఉండడంతో రైతులు ఇబ్బంది పడ్డా రు. ఆ తర్వాత ఎకరాకు 12 క్వింటాళ్లకు బదులు ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేసేలా కొత్త నిబంధన పెట్టి.. యాప్‌లో మార్పు చేయడం తంటాలు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల, మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని అప్పాయిపల్లి.. నారాయణపేట జిల్లాలోని లింగంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీఐ సెంటర్ల వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మరోవైపు తేమ ఎనిమిది నుంచి 12 శాతం ఉంటేనే మద్దతు ధరతో కొనుగోలు చేస్తామనే కొర్రీ వెంటాడుతోంది. దీంతో రైతులు పత్తిని ఆరబెడుతూ కొనుగోళ్లకు పడిగాపులు కాయక తప్పడం లేదు.
తెల్లబోతున్నారు..!
తెల్లబోతున్నారు..!


