ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ
కోస్గి రూరల్/నర్వ/మద్దూరు: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని.. అర్హులందరికీ విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గుండుమాల్ మండలం ముదిరెడ్డిపల్లిలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను సోమవారం కాడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముదిరెడ్డిపల్లికి 104 ఇళ్లను మంజూరు చేయగా.. అందులో ఆరు ఇళ్లను ఒకే రోజు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మరో 20 ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయ న్నారు. మిగిలిన ఇళ్ల పనులను కూడా లబ్ధిదారులు త్వరగా పూర్తిచేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం గుండుమాల్‌లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, హౌసింగ్ పీడీ శంకర్ పాల్గొన్నారు.
● ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అన్నారు. మద్దూరు మండలం దోరేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించడం లేదని గుర్తించిన కలెక్టర్.. పాఠశాల ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోసారి మెనూ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అధికారులపై ఆగ్రహ ం
నర్వ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగడంపై కలెక్టర్ అసహ నం వ్యక్తంచేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై ఆమె సమీక్షించారు. మండలానికి 308 ఇళ్లు మంజూరు కాగా.. 170 ఇళ్లకు మార్కింగ్ వేశారని, 98 ఇళ్లు బేస్‌మెంట్ లేవెల్, 10 స్లాబ్ లేవల్, మరో 17 గోడల దశలో కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. జూలైలో ప్రా రంభించిన ఇళ్ల పనులు నేటికీ ప్రగతిలో లేకపోవడం, జిల్లాలో నర్వ మండలం వెనకబడటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇళ్ల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా యాస్పిరేషన్ బ్లాక్ కింద ఎంపికై న నర్వ మండలం నీతి అయోగ్ మార్గదర్శకాల ప్రకారం అన్ని అంశాల్లో ప్రగతి సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం కోసం రైతులకు రూ. 15లక్షలు, కేజీబీవీకి సోలార్ కిచెన్ కోసం రూ. 58లక్షలు మంజూరైనట్లు కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్డీఓ మొగులప్ప, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.శైలజ, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏఓ అఖిలారెడ్డి ఉన్నారు.
లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్


