అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
నారాయణపేట: ప్రజావాణిలో వివిధ సమస్యలపై అందే అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 22 అర్జీలు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన సూచించారు.
● సీనియర్ సిటిజన్ యాక్ట్‌పై క్షేత్రస్థాయిలో సంపూర్ణ అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను అన్నారు. వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో అధికారులకు సీనియర్ సిటిజన్ యాక్ట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్‌కు కొన్ని హక్కులు ఉన్నాయని, వాటిపై గ్రామస్థాయిలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంచేసే వారిపై ఆర్డీఓకు ఫిర్యాదు చేయవచ్చని.. మూడు నెలల్లో బాధిత వృద్ధులకు న్యాయం చేకూరుతుందన్నారు. దూర ప్రాంతాలకు చెందిన వృద్ధులు జిల్లా కేంద్రానికి వచ్చే అవసరం లేదని.. టోల్‌ఫ్రీ 14567 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తల్లిదండ్రులను పట్టించుకోని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్ పాల్గొన్నారు.


