కూరగాయలు కుతకుత
దళారుల ఇష్టారాజ్యం..
మార్కెట్‌లో ఏది కొనాలన్నా కిలో రూ. 60పై మాటే..
● భారీగా పెరిగిన ధరలతో సామాన్యుల బెంబేలు
● జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న తోటలు
● ఇతర ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతి
● మార్కెట్‌లో అమాంతం పెరిగిన ధరలు
●
నారాయణపేట: కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో గత వానాకాలం కూరగాయల సాగు 100 ఎకరాలు కూడా దాటలేదు. యాసంగి సీజన్ ప్రారంభమై నెలరోజులు అవుతున్నా కూరగాయల సాగు అంతంతమాత్రమే. వానాకాలంలో సాగుచేసిన కూరగాయల తోటలన్నీ వర్షాలకు దెబ్బతిన్నాయి. దిగుబడులు భారీగా పడిపోయాయి. జిల్లాకు కర్ణాటకలోని రాయచూర్, ఏపీలోని కర్నూలు నుంచి కూరగాయలను నిత్యం దిగుమతి చేసుకోవాల్సిందే. ఆయా ప్రాంతాల్లోనూ వర్షాలకు తోటలు దెబ్బతినడంతో ధరలు అమాంతం పెరిగాయి. జిల్లాలోని రైతుబజారుతో పోలిస్తే బయట కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు అధికంగా ధరలు ఉన్నాయి. ప్రతి కూరగాయ కిలో ధర రూ.80 నుంచి రూ.100 వరకు ధర పలుకుతోంది. నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదంటూ ఆందోళన చెందుతున్నారు.
మక్తల్ పట్టణంలోని రైతుబజార్
భూనేడు, నిడ్జింత గ్రామాల్లో 40 ఎకరాలకు పైగా రైతులు టమాటా, వంకాయ, మిరప సాగుచేస్తారు. పండించిన కూరగాయలను సమీప గ్రామాల్లో ఉదయం పూట సంత బజార్లలో విక్రయించేవారు. ఆ సంతల్లో ధరలు తక్కువగా ఉండేవి. గత నెలలో కురిసిన వానలతో కూరగాయల తోటలు పాడైపోయ్యాయి. ఇప్పుడు మహబూబ్‌నగర్ రైతు బజారులో కూరగాయలు తెచ్చి అమ్ముతున్నారు. ఆటోల కిరాయి భారం మాపై పడుతుంది. – గొల్ల సాయమ్మ, భూనేడు, కొత్తపల్లి మండలం
గత నెలతో పోలిస్తే కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. 15–20 రోజుల క్రితం టమాటా కిలో రూ.20, కాలీఫ్లవర్, బెండ, చౌలకాయ ఇలా ఏ కూరగాయ కొన్నా రూ. 60 లోపే ఉండేవి. ప్రస్తుతం కూరగాయల ధరలు షాక్ కొడుతున్నాయి. టమాటాతో సహా అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. రైతుబజారులో రైతులు తెల్లవారుజామున గంపగుత్తగా విక్రయించి వెళ్తున్నారు. కూరగాయల వ్యాపారం చేసే వారు వాటిని కొనుగోలుచేసి.. అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో రైతుబజార్ ఉన్నా లాభం లేదంటూ జనం వాపోతున్నారు. రైతుబజార్‌లోని ధరలు బోర్డుకే పరిమితం కావడం కొసమెరుపు.
కూరగాయలు కుతకుత


