నేటి నుంచి పత్తి కొనుగోలు నిలిపివేత
నారాయణపేట టౌన్: ఉమ్మడి జిల్లాలోని కాటన్ జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు పోతిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాటన్ జిన్నింగ్ మిల్లులపై సీసీఐ నిబంధనలను సడలించాలని డిమాండ్ చేస్తూ.. సీసీఐ ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలతో పాటు ప్రైవేటు మిల్లుల్లో పత్తి కొనుగోళ్లను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. తమకు పత్తి రైతులు సహకరించాలని కోరారు.
గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లొద్దు
నారాయణపేట: మల్టీ లేవెల్ మార్కెటింగ్ స్కీంలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డా.వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సొమ్ము దోచుకోనేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ప్రయోగిస్తున్నారన్నారు. గొలుసుకట్టు వ్యాపారాలతో మోసంచేసే మల్టీ లేవెల్ వ్యాపారాలు పెరుగుతున్నాయని.. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాట్సప్, టెలీగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు చేసి.. అమాయకులకు ఆర్థిక నష్టాన్ని కలగజేస్తారన్నారు. అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింక్‌లు, ఏపీకె ఫైల్స్ లాంటివి డౌన్‌లోడ్ చేయవద్దని సూచించారు. ఆర్థిక మోసాలపై వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.
నేడు ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు
కందనూలు: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల ఖోఖో జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఖోఖో అసోసియేషన్ ఇన్‌చార్జి నిరంజన్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికల జట్లకు ఎంపికై న క్రీడాకారులు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువులో నిర్వహించే 44వ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ చాంపియన్‌షిప్‌లో ఉమ్మడి జిల్లా తరఫున పాల్గొంటారని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే బాలబాలికలు 18 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలని సూచించారు. మరింత సమాచారం కోసం 95531 24166, 94934 50450, 91331 48136 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
బీసీలకు 42 శాతం
రిజర్వేషన్లు కల్పించాలి
నారాయణపేట టౌన్: స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జాగృతిసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద బీసీ జాగృతిసేన, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం సామాజిక న్యాయ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. లేనిచో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, సామాజిక న్యాయ దీక్షకు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్ మద్దతు తెలిపి మాట్లాడారు. బీసీల పోరాటం తెలంగాణ ఉద్యమంలా సాగాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్‌యాదవ్, మడిపల్లి కృష్ణయ్య, వెంకట్రామిరెడ్డి, కాశీనాథ్, బలరాం, కాళేశ్వరం పాల్గొన్నారు.
14,485 బస్తాల
మొక్కజొన్న రాక
నవాబుపేట: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఆదివారం 14,485 బస్తాల మొక్క జొన్న ధాన్యం వచ్చింది. కాగా మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,034 కనిష్టంగా రూ.1,767 ధర పలికింది. అలాగే 2,078 బస్తాల వరిధాన్యం రాగా.. సరాసరిగా రూ.2,552 ధర లభించింది. మొక్కజొన్నతోపాటు వరి ధ్యానం సైతం బుధ, ఆదివారాలు పెద్ద మొత్తంలో మార్కెట్‌కు వస్తుందని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని మార్కెట్ కార్యదర్శి రమేష్ తెలిపారు.
నేటి నుంచి పత్తి కొనుగోలు నిలిపివేత


