పటేల్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్దాం
నారాయణపేట రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ నెల 24న జిల్లా కేంద్రంలో ఐక్యత పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా యువజన అధికారి వి.కోటానాయక్ తెలిపారు. ఐక్యత పాదయాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆదివారం జిల్లా కేంద్రంలో విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు మరువలేనివన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేయడంతో పాటు తెలంగాణ బానిసత్వానికి విముక్తి కల్పించారని గుర్తుచేశారు. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడలశాఖ ఆధ్వర్యంలో 20 రోజుల క్రితం చేపట్టిన ఐక్యత పాదయాత్ర నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పూర్తిచేసుకొని.. ఈ నెల 24న నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో 4 కి.మీ. పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ డీకే అరుణ హాజరై ప్రారంభిస్తారని.. పాదయాత్రలో కలెక్టర్, ఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. అన్ని కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పాదయాత్ర జిల్లా కన్వీనర్ డోకూరు తిరుపతిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండా సత్యయాదవ్, ప్రచార కార్యదర్శి కిరణ్ ఉన్నారు.


