మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌కు మహర్దశ
స్టేషన్ మహబూబ్‌నగర్: అమృత్ భారత్ స్టేషన్ పథకంతో హైదరాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో పెద్ద స్టేషన్‌లలో ఒకటైన మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ఈ పథకంతో మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు మహర్దశ కలగనుంది. రైల్వే స్టేషన్‌ను అనేక వసతులతో ఆధునీకరించనున్నారు. జిల్లాకేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో అమృత్‌భారత్ స్టేషన్ పథకం కింద పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఎఫ్‌ఓబీ, ఇతర పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్న రైల్వే స్టేషన్ పాత భవనాన్ని పూర్తిగా తొలగించి కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న బుకింగ్ కౌంటర్, విచారణ (ఎంక్వయిరీ) కేంద్రాలను స్టేషన్‌కు కుడివైపు ఉన్న ఆర్‌పీఎఫ్ పోలీస్ స్టేషన్ వెనుకాల ఉన్న తాత్కాలిక భవనంలోకి, రిజర్వేషన్ కౌంటర్‌ను ఎడమవైపు ఉన్న రైల్వే మెయిల్ కార్యాలయ భవనంలో ఎస్‌బీఐ ఏటీఎం పక్కన ఏర్పాటు చేశారు.


