పాలనలో పారదర్శకత కోసమే స.హ.చట్టం
● ప్రతిఒక్కరూ చట్టంపై అవగాహనపెంచుకోవాలి
● రాష్ట్ర సమాచార హ క్కు చట్టం
ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి
నారాయణపేట: ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి, పారదర్శక పాలన అందించేలా, జవాబుదారీ తనాన్ని పెంచేలా చేయడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని.. ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతోపాటు ఇతర కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, మోసినా ఫర్విన్ హాజరయ్యారు. వీరికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్లు శ్రీను, సంచిత్ పూల మొక్కలతో స్వాగతం పలికారు. అనంతరం వారు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సులో ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. పీఐఓలు, ఏపీఐవోలు సమాచార హక్కు చట్టాన్ని అర్థం చేసుకొని నిర్దిష్టంగా అమలు చేసి దేశంలోనే ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారంలో రాష్ట్రాన్ని, జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టేలా చేయాలని సూచించారు. గత మూడున్నరేళ్లుగా సమాచార కమిషనర్ల నియామకం లేకపోవడంతో చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని ఈ జిల్లాల పర్యటన ద్వారా అందరికీ అవగాహన కల్పించి, పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆర్టీఐ ద్వారా సమాచారం పొందే వివిధ మార్గాల గురించి ఆయన క్లుప్తంగా వివరించారు. నిజానికి ఆర్టీఐ ద్వారా 90 శాతం సమాచారం ఇస్తున్నామని, 10 శాతం మాత్రమే అప్పీలుకు వస్తున్నాయని చెప్పారు.
సమర్థవంతంగా చట్టం అమలు చేద్దాం..
సమాచార హక్కు చట్టం కమిషనర్ –1 పీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పథకాలను సక్రమంగా అమలు చేసి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో సమాచార హక్కు చట్టం పాత్ర కీలకమని తెలిపారు. జిల్లాలో ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేద్దామని ఆయన సూచించారు. కమిషనర్ – 2 మౌసినా ఫర్వీన్ మాట్లాడుతూ.. తాము జిల్లాల పర్యటన ద్వారా పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తూ వస్తున్నామని, దరఖాస్తు వచ్చిన 5 రోజుల్లో సమాచారం ఇవ్వాలన్నారు.ఈమేరకు ఆర్టీఐ యాక్ట్‌పై దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ఈ చట్టంపై ప్రతి ఒక్క అధికారి అవగాహన పెంచుకోవాలని, జిల్లాలో 104 కేసులు విచారణకు ఇచ్చామన్నారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులపై విచారణ నిర్వహించారు. సంబంధిత పీఐవో అధికారులు, దరఖాస్తుదారుల నుంచి వివరాలు స్వీకరించి తగిన ఆదేశాలు జారీ చే శారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమా ర్, ఆర్డీఓ రామచంద్రనాయక్, డీఎస్పీ మహేష్, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణి కుమార్, అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, పిఐఓ లు, అప్పీలెట్ అధికారులు పాల్గొన్నారు.


